నిషేధిత ఉత్పత్తులపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-10-26T05:09:16+05:30 IST

మత్తును చిత్తు చేసేందుకు మెదక్‌ జిల్లా పోలీస్‌ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది.

నిషేధిత ఉత్పత్తులపై ఉక్కుపాదం

 మెదక్‌, సంగారెడ్డి జిల్లాలోని  పలు దుకాణాల్లో  ఆకస్మిక తనిఖీలు


మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 25: మత్తును చిత్తు చేసేందుకు మెదక్‌ జిల్లా పోలీస్‌ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. గుట్కా, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుదిట్టంగా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో మెదక్‌ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో పట్టణ సీఐ వెంకట్‌ బృందంతో కలిసి పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు నిషేధిత పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు  ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి గుట్కా, పాన్‌, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నామన్నారు గంజా యి, పాన్‌పరాగ్‌, గుట్కా తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయించే వారిపై నిఘా పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మూలాలను గుర్తించి నిర్మూలిస్తామన్నారు. యువతను ప్రలోభాలకు గురిచేసి, తప్పుదారి పట్టిస్తున్నవారు ఎంతటివారైనా, వారి వెనకు ఎవరున్నా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.


గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు

అల్లాదుర్గం, అక్టోబరు 25: నిషేధిత గుట్కా, గంజాయి తదితర మత్తు పదార్థాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం ఎస్‌ఐ మోహన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ట్రైయినీ ఎస్‌ఐ   స్నేహ, పోలీస్‌ సిబ్బందితో కలసి పట్టణంలోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 


గంజాయి మొక్కల ధ్వంసం

వట్‌పల్లి, అక్టోబరు 25: వట్‌పల్లి మండలంలోని పాలడుగు గ్రామ శివారులో పత్తి చేనులో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు వట్‌పల్లి ఎస్‌ఐ దశరథ్‌ తెలిపారు. పాలడుగు గ్రామ శివారులో గొల్ల హన్మంతు తన పత్తి చేనులో గంజా యిని అంతర పంటగా సాగు చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేశారు. రూ.80వేల విలువ గల 80 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి, అతడిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.


గంజాయి సాగు చేస్తే కేసులే

 సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావు

సంగారెడ్డిటౌన్‌, అక్టోబరు25: గంజాయి సాగుచేసే వారిపై ప్రభుత్వం  కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు పేర్కొన్నారు. గంజాయి సాగు చేస్తే వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. సంబంధిత రైతుకు రైతుబంధు, రైతు బీమా,  ఉచిత విద్యుత్‌ ఉండబోదని, ప్రభుత్వ పథకాలు ఏవీ వర్తించవని ఆయన స్పష్టం చేశారు. గంజాయి సాగుచేసే రైతులది పట్టాభూమి అయితే బ్లాక్‌లిస్టులో పెడతామన్నా రు. ప్రభుత్వ లావాని పట్టా అయితే తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని హెచ్చరించారు. ఏఈవోలు తమ క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూ చించారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. 


రూ. 11 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

 బొల్లారంలో రూ. 10 లక్షలు,  పటాన్‌చెరులో రూ.లక్ష విలువ

జిన్నారం/పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో రూ. 11లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో బొల్లారంలోని జ్యోతినగర్‌లో దత్తు అనే వ్యక్తి కిరాణా దుకాణంలో తనిఖీలు చేపట్టామని  బొల్లారం సీఐ ప్రశాంత్‌ తెలిపారు. అతడి దుకాణంలో రూ.10 లక్షల విలువైన గుట్కా సంచులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. గుట్కా సంచులు స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో హోల్‌సేల్‌ గుట్కా వ్యాపారం, మత్తుపదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. లక్ష విలువ గల గుట్కా, తంబాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పటాన్‌చెరు గోకుల్‌నగర్‌కు చెందిన మన్నార్‌నరసింహమూర్తి (55) హోల్‌సేల్‌గా గుట్కాను ఇతర ప్రాంతాలనుంచి తెప్పించి స్థానికంగా ఉన్న పాన్‌షా్‌పలు, కిరాణాదుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. విశ్వసనీయమైన సమాచారం మేరకు నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ. లక్ష విలువ గల గుట్కా డంప్‌ బయటపడింది. 

హిజ్రా నుంచి 6 కేజీల గంజాయి స్వాధీనం

రామచంద్రాపురం, అక్టోబరు 25: యువతకు గంజాయి విక్రయిస్తున్న హిజ్రాను రామచంద్రాపురం పోలీసులు పట్టుకున్నారు. హిజ్రా నుంచి సుమారు రూ.5లక్షల విలువ చేసే 5.752 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  సీఐ సంజయ్‌కుమార్‌, ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రవీంద్ర బన్‌సల్‌(23) పొట్టకూటి కోసం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల కొల్లూరుకు వలస వచ్చింది. కూలీ పనులు చేసుకునే బన్‌సల్‌ ఆర్థికంగా త్వరగా స్థిరపడాలని యువతకు గంజాయి విక్రయించడం ప్రారంభించింది. పక్కా సమాచారంతో సోమవారం ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు సిబ్బందితో కలిసి ఆమెను పట్టుకున్నారు. ఆర్‌ఐ దీక్షిత్‌కుమార్‌, వీఆర్వో రాజమల్లేశం సమక్షంలో హిజ్రా నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-10-26T05:09:16+05:30 IST