అట్టహాసంగా రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-24T05:23:52+05:30 IST

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం 8వ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.

అట్టహాసంగా రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం
క్రీడాజ్యోతిని వెలిగిస్తున్న సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, విద్యార్థులు

సిద్దిపేట టౌన్‌, నవంబరు 23 : సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం 8వ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. ఈ పోటీలకు దాదాపు 20 జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్‌లు, మేనేజర్లు, 20 మంది టెక్నికల్‌ అధికారులు హాజరయ్యారు. 25వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారన్నారు. అదేవిధంగా క్రీడలకు మంచి ప్రాధాన్యమిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, తద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఏదైనా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే చాలా మంచిదని, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట కళలకు కాణాచి అని వివరించారు. బాల్యానికి ఆటలు చాలా అవసరమని, జీవితంలో విజయం సాధించాలంటే, ప్రణాళికతో ముందుండాలన్నారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి కైలాసం మాట్లాడుతూ ఈ పోటీలను సిద్దిపేటలో నిర్వహించే అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వసంతకుమార్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలకు అన్ని విధాల సహాయసహాకారాలు అందిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రేణుక, స్థానిక కౌన్సిలర్‌ ముత్యాల శ్రీదేవిబుచ్చిరెడ్డి, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మురళీధర్‌, శ్యాంసుందర్‌శర్మ, గంగమోహన్‌, ఎస్‌జీఎఫ్‌ సిద్దిపేట జిల్లా కార్యదర్శి బిక్షపతి, పీఈటీఏ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట సతీష్‌, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-24T05:23:52+05:30 IST