కొలనుపాక సోమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేయాలి
ABN , First Publish Date - 2021-03-25T05:25:12+05:30 IST
లోక కల్యాణార్థం బిచ్కుంద మఠ సంస్థాన్ ఆధ్వర్యంలో పీఠాధిపతి సోమలింగ శివాచార్య స్వామి దాదాపు వంద మందితో చేపట్టిన మహా పాదయాత్ర బుధవారం సిద్దిపేట జిల్లాలో ఘనంగా సాగింది.

యాదాద్రి తరహాలో నిధులివ్వాలి
బిచ్కుంద మఠసంస్థాన్ పీఠాధిపతి సోమలింగ శివాచార్య
గజ్వేల్ నుంచి జగదేవపూర్ వరకు సాగిన మహా పాదయాత్ర
గజ్వేల్/జగదేవపూర్, మార్చి 24: లోక కల్యాణార్థం బిచ్కుంద మఠ సంస్థాన్ ఆధ్వర్యంలో పీఠాధిపతి సోమలింగ శివాచార్య స్వామి దాదాపు వంద మందితో చేపట్టిన మహా పాదయాత్ర బుధవారం సిద్దిపేట జిల్లాలో ఘనంగా సాగింది. పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి గజ్వేల్‌లో బస చేసిన స్వామి బుధవారం ఉదయం గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్, అక్కారం, గణే్‌షపల్లి, అలిరాజపేట మీదుగా జగదేవపూర్ చేరుకున్నారు. మధ్యాహ్నం మర్కుక్ మండలం గణే్‌షపల్లిలోని లక్ష్మీనర్సింహ ఆలయం వద్ద స్థానిక సర్పంచ్ మంజులా శ్రీరాములు ఆఽధ్వర్యంలో పాదయాత్రలో పాల్గొన్న వారికి అన్నప్రసాద సమర్పణ చేశారు. సాయంత్రం జగదేవపూర్‌లో గొల్లపల్లి పాయింట్ నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా చిన్మయ మిషన్ వరకు సాగిన పాదయాత్రలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. భక్తుల ఆటపాటలతో, శివనామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బిచ్కుంద మఠ సంస్థాన్ పీఠాధిపతి సోమలింగ శివాచార్య మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యంత పురాతన ఆలయమైన కొలనుపాక సోమేశ్వరాలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాల్సిన అవసరముందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఈ నెల 26న తమ పాదయాత్ర కొలనుపాక సోమేశ్వరాలయానికి చేరుకుంటుందని, అక్కడ భారీ జనం మధ్య ధర్మసభ నిర్వహిస్తామని బిచ్కుంద పీఠాధిపతి తెలిపారు. పాదయాత్రలో జడ్పీటీసీ ఎంబరి మంగమ్మా రామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, ఎంపీటీసీ నరేందర్, నాచారం దేవస్థానం ధర్మకర్త భీమప్ప, వీరశైవ లింగాయత్ సమాజం భక్తులు, రిమ్మనగూడ, దాతర్‌పల్లి, అక్కారం, తిగుల్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.