ఘనపూర్ ఆయకట్టుకు సింగూరు జలాలు
ABN , First Publish Date - 2021-01-12T05:39:52+05:30 IST
ఘనపూర్ ఆయకట్టు పరిరక్షణ (వనదుర్గ ప్రాజెక్టు)కు సోమవారం సింగూరు జలాలను విడుదల చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు వరినాట్లు వేసేందుకు సాగునీరు అవసరముండటంతో ప్రభుత్వం నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది

పుల్‌కల్, జనవరి 11 : ఘనపూర్ ఆయకట్టు పరిరక్షణ (వనదుర్గ ప్రాజెక్టు)కు సోమవారం సింగూరు జలాలను విడుదల చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు వరినాట్లు వేసేందుకు సాగునీరు అవసరముండటంతో ప్రభుత్వం నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సింగూరు ప్రాజెక్టు నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం 2,920 క్యూసెక్కులను రెండు దఫాలుగా యూనిట్-1, యూనిట్-2 విద్యుదుత్పత్తి గేట్ల గుండా విడుదల చేశారు. సింగూరు జలాలు ప్రాజెక్టు దిగువన గల మంజీర జలాశయానికి చేరాయి. అక్కడి నుంచి క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని ఘనపూర్‌కు వదిలారు.
శిథిలావస్థకు ఘణపురం ప్రాజెక్టు షెటర్లు
కొల్చారం, జనవరి 10 : మెదక్ జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘణపూర్(వనదుర్గా ప్రాజెక్టు) ఆనకట్ట షెటర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో నీరు మహబూబ్‌నగర్ కాల్వ నుంచి వృథాగా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో షెటర్ మరమ్మతులు సగం సగం చేయడంతో మళ్లీ పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే మంజీరాలోకి నీరు వెళ్లేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు కుమ్మక్కై షెటర్న్ ధ్వంసం చేశారు. రైతులు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
