వెంటాడుతున్న గన్నీ బ్యాగుల కొరత
ABN , First Publish Date - 2021-05-20T05:30:00+05:30 IST
కోహెడ మండలం తంగళ్లపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ సంచుల కొరత రైతులను వెంటాడుతున్నది.

తంగళ్లపల్లి కొనుగోలు కేంద్రంలో రైతుల ఎదురుచూపులు
కడవేరుగులో అదనంగా తెప్పించి రైతులకు అందజేసిన అధికారులు
కోహెడ, మే 20: కోహెడ మండలం తంగళ్లపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ సంచుల కొరత రైతులను వెంటాడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కిందిస్థాయి సిబ్బంది పెడచెవిన పెడుతున్నారు. గురువారం గన్నీ సంచుల కోసం రైతులు ఎదురుచూపులతో నీరసించారు. ఈ కొనుగోలు కేంద్రంలో సన్న, చిన్న కారు రైతులు ధాన్యం విక్రయానికి నానా తంటాలు పడుతున్నారు. పైరవీదారులకు ప్రాధాన్యమిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అసలే అకాల వర్షాలు.. ఆపై గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కేంద్రంలో ధాన్యం పోసి నెలలు గడిచినా సంచులు ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోలుకు అధికారులు అనుసరిస్తున్న విధానంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తగినన్ని సంచులు అందించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతున్నది. దీంతో సంచుల కోసం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న, సన్నకారు రైతులకు నంబర్లు కెటాయించిన ప్రకారం సంచులను ఇవ్వక పోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. 388 మంది రైతులకు సీరియల్ నంబర్లు ఇచ్చినప్పటికీ 216 మంది రైతులకు గన్నీబ్యాగులు ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. సీనియారిటీ ప్రకారం కొనుగోలు చేసిన రైతుల జాబితాను బహిరంగా పరచకుండా గోప్యత పాటిస్తున్న అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడవేరుగు కొనుగోలు కేంద్రానికి అదనంగా గన్నీ బ్యాగులు
చేర్యాల, మే 20: చేర్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డుతో పాటు మండలంలోని కడవేరుగు గ్రామంలోని ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని గురువారం ఎంపీడీవో తారీక్ అన్వర్, డీసీవో అమృతసేనారెడ్డి, మార్కెట్ వైస్‌చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అఽధికారులను సంప్రదించి అదనంగా గన్నీ బ్యాగులను తెప్పించి రైతులకు అందజేశారు.