గొర్రెలొస్తున్నాయ్‌

ABN , First Publish Date - 2021-02-05T05:47:44+05:30 IST

గొల్లకురుమ, యాదవుల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి మోక్షం లభించింది.

గొర్రెలొస్తున్నాయ్‌

ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు

మొత్తం లక్ష్యం 31,168 యూనిట్ల పంపిణీ 

రెండు విడతల్లో 16,876 గ్రౌండింగ్‌

ఇంకా పంపిణీ చేయాల్సిన యూనిట్లు 14,299


సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 4: గొల్లకురుమ, యాదవుల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి మోక్షం లభించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం రెండో విడత పంపిణీ మొదలు కానున్నది. నిధుల కేటాయింపును బట్టి ఆయా జిల్లాల్లో దశలవారీగా రెండో విడత పంపిణీని ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సంగారెడ్డి జిల్లాలోనూ రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టడానికి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. 


ఎన్నికలతో రెండో విడతకు బ్రేక్‌

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2016లో గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ముందుగా గుర్తించన మేరకు మొదటి విడత పంపిణీ ఆర్భాటంగా పూర్తిచేశారు. కానీ వివిధ కారణాలతో రెండో విడతకు బ్రేక్‌ పడింది. నిధుల కొరతతో పాటు 2018లో శాసనసభ, 2019లో పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో గొర్రెల పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది. గతేడాది కరోనా ఎఫెక్ట్‌తో ఈ విషయం గురించి ఆలోచించే పరిస్థితి లేకుండాపోయింది. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ కొద్దికొద్దిగా తేరుకుంటున్న తరుణంలో ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీకి ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబరులో ఈమేకు ఉత్తర్వులు జారీ చేసింది. 


మొదటి విడతలో 95 శాతం.. రెండో విడతలో 15 శాతం

జిల్లాలో లబ్ధిదారులకు మొత్తం 31,168 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం లబ్ధిదారులకు రెండు విడతలుగా గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి విడత (లిస్ట్‌–ఏ)లో 15,679 యూనిట్లు, రెండ విడత (లిస్ట్‌–బీ)లో 15,489 యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. 2016లో ప్రారంభమైన మొదటి విడతలో 95 శాతం గ్రౌండింగ్‌ పూర్తయింది. 2017లో చేపట్టిన రెండో విడతలో 15 శాతం మాత్రమే గ్రౌండింగ్‌ పూర్తి చేశారు. 


రెండు విడతల్లో 16,876 గ్రౌండింగ్‌

జిల్లాలో రెండు విడతల్లో మొత్తం 31,168 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేఽశించగా ఇప్పటి వరకు 16,876 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్‌ చేశారు. ఇంకా 14,292 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉన్నది. మొదటి విడతలో 15,679 యూనిట్లు మంజూరు కాగా.. 14,548 మంది లబ్ధిదారులు తమ వాటా ధనాన్ని డీడీల రూపంలో చెల్లించారు. వీరిలో 14,425 మందికి గొర్రెల యూనిట్లను అందజేశారు. మొదటి విడతలో ఇంకా 123 మందికి సంబంధించిన డీడీలు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో విడతలో 15,489 యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉండగా పథకం నిలిచిపోయే వరకు 5,035 మంది డీడీల రూపంలో తమ వాటా ధనాన్ని చెల్లించారు. వీరిలో 2,451 మందికి గొర్రెలను అందజేశారు. డీడీలు చెల్లించిన వారిలోనూ 2,584 మందికి యూనిట్లు ఇవ్వలేదు. వీరి డీడీలు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వీరందరికి యూనిట్లు ఇవ్వనున్నారు. రెండో విడతలో ఇవ్వడానికి గుర్తించిన మిగిలిన లబ్ధిదారుల నుంచి కూడా వాటా ధనాన్ని డీడీల రూపంలో సేకరించి త్వరలోనే గొర్రెల పంపిణీ చేసేందుకు పశుసంవర్థక శాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Updated Date - 2021-02-05T05:47:44+05:30 IST