విద్యుదాఘాతంతో ఆపరేటర్‌కు తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-05-20T05:48:59+05:30 IST
ట్రాన్స్‌కో లైన్‌మ్యాన్ నిర్లక్ష్యం వల్ల ఒకరికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రహించిన గ్రామస్థులు సబ్‌స్టేషన్ వద్ద ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు.

సబ్‌స్టేషన్ వద్ద గ్రామస్థుల ఆందోళన
మెదక్ రూరల్, మే 19: ట్రాన్స్‌కో లైన్‌మ్యాన్ నిర్లక్ష్యం వల్ల ఒకరికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రహించిన గ్రామస్థులు సబ్‌స్టేషన్ వద్ద ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. మండలంలోని పాతూర్ గ్రామానికి చెందిన ఆనంద్ తొగిట సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేసేందుకు లైన్‌మ్యాన్, ఆపరేటర్ ఆనంద్‌ను పిలిపించాడు. ఆనంద్ పాతూర్ సబ్‌స్టేషన్‌లో ఎల్‌సీ తీసుకొని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో సబ్‌స్టేషన్ వద్ద ఉండాల్సిన లైన్‌మ్యాన్ ఎక్కడికో వెళ్లిపోయాడు. డ్యూటీలో ఉన్న విషయం తెలియని మరో ఆపరేటర్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాడు. దీంతో విద్యుత్ షాక్ తగిలిన ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. లైన్‌మ్యాన్ నిర్లక్ష్యంతో పాటు ఆపరేటర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగిందని ఆగ్రహించిన స్థానికులు ఆపరేటర్‌పై దాడి చేసి ఆందోళన చేశారు. గాయాలైన ఆనంద్‌కు వైద్యం అందించాల్సిన లైన్‌మ్యాన్ కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్‌మెన్లు చేయాల్సిన పనులు ఇతరులతో చేయించి ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన లైన్‌మ్యాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.