ఆపత్కాలంలో ఆకలి తీరుస్తూ..

ABN , First Publish Date - 2021-05-31T05:16:49+05:30 IST

‘‘అన్ని దానాల్లో కన్న అన్నదానం గొప్ప’’ అనే నానుడిని అక్షరాల నిజం చేస్తున్నారు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన స్వచ్ఛంధ సేవకులు.

ఆపత్కాలంలో ఆకలి తీరుస్తూ..
కొండపాకలోని సత్యసాయి ప్రశాంతినికేతన్‌ కళాశాల ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్న భోజనం పార్శిల్‌


కొవిడ్‌ పేషెంట్లకు మూడుపూటలా భోజనం

ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు ఉచితంగా పార్శిళ్లు

యాచకులు, అభాగ్యులపైనా ఆదరణ

ముందుకొస్తున్న మిత్రులు, సంఘాలు

సొంత ఖర్చుతో కడుపు నింపుతున్న స్వచ్ఛంద సంస్థలు 



‘‘అన్ని దానాల్లో కన్న అన్నదానం గొప్ప’’ అనే నానుడిని అక్షరాల నిజం చేస్తున్నారు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన స్వచ్ఛంధ సేవకులు. కరోనా కష్టకాలంలోనూ అభ్యాగుల ఆకలి తీరుస్తున్నారు. మూడుపుటలా అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. కొవిడ్‌ నియంత్రణలో పాలుపంచుకుంటున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్లకూ మంచి భోజనం అందిస్తున్నారు.


  ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట/మెదక్‌/నర్సాపూర్‌, మే 30: సిద్దిపేట పట్టణానికి చెందిన అఖిల్‌కుమార్‌, శశికర్‌, మధుసూధన్‌, సంతోష్‌, శ్రీనివాస్‌, జాకీర్‌, శ్రీకాంత్‌, మహేందర్‌, కృష్ణ, రమేశ్‌, శశికాంత్‌, భవిత్‌రెడ్డి, అజిత్‌, మహేశ్‌, చింటు, వంశీ అనే మిత్రులు ఒక్కటై ప్రతీరోజు 150 మందికి భోజనాలు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నారు. వారే వంటలు చేసి మంచి పోషకాహారాన్ని మధ్యాహ్నం, రాత్రివేళల్లో కరోనా పేషెంట్లకు, యాచకులకు, పేదవారికి ఇస్తున్నారు. ఈ యువకులంతా కలిసి ఒక బైక్‌ అంబులెన్సును సైతం అందుబాటులోకి తెచ్చారు. వైద్యులు, పోలీసులకు కొండపాక మండలంలోని సత్యసాయి ప్రశాంతినికేతన్‌ కళాశాల ఆధ్వర్యంలో మంచి భోజనం అందిస్తున్నారు. ప్రతిరోజు 400 మందికి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనంతోపాటు వెజిటేబుల్‌ సలాడ్‌, జ్యూస్‌, స్వీట్స్‌, రాగిమాల్ట్‌, బాదం జ్యూస్‌ లాంటివి పంపిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యసిబ్బందికి, కొవిడ్‌ పేషెంట్లకు, పోలీసులకు సమయానికి పోషకాహారాన్ని చేరవేస్తున్నారు. ఈ కళాశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది స్వయంగా తయారు చేస్తూ తమదైన చేయూతను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేటకు చెందిన నారీసేన అనే సంస్థ ప్రతీరోజు 200 మందికి రెండు పూటలా ఉచితంగా భోజనం అందిస్తున్నది. వీరికి మంత్రి హరీశ్‌రావు సహకారం కూడా ఉంది. చేర్యాలలోని సేవాభారతి ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, రెండుపూటలా భోజనం, డ్రైప్రూట్స్‌, రాగిజావా ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఆరోగ్యపరమైన సేవల నిమిత్తం వెంకటసాయి ఆస్పత్రి డాక్టర్‌ శ్రీనివాస్‌, మానసికోల్లాసం కోసం గణేష్‌ అనే శిక్షకుడుతో జూమ్‌ యాప్‌ ద్వారా సాయంత్రం వేళల్లో సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. అలాగే సాయిరక్ష ఆస్పత్రి మెడికల్‌ షాప్‌ యజమాని సంతోష్‌ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. 


వారి కృషి అనిర్వచనీయం

- చేర్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి భోజనం అందిస్తున్నారు.

- చేర్యాల కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌ తన సొంత ఖర్చులతో మున్సిపల్‌,  

  పోలీస్‌, వైద్య సిబ్బందికి భోజనాలు అందజేస్తున్నారు.

- కొమురవెల్లికి చెందిన యువకుడు ఉప్పల వంశీకృష్ణ ప్రతీరోజు ఈ మండ

 లంలోని పలు గ్రామాలతోపాటు కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామా

 నికి చెందిన వారికి రెండుపూటలా బోజనాలు పంపిస్తున్నాడు.

- కొండపాక సర్పంచ్‌ చిట్టి మాధురి ఆధ్వర్యంలో గ్రామంలోని 

  బాలికల వసతిగృహాన్ని ఐసోలేషన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసి 

   అందులోని పేషెంట్లకు మూడుపూటలా తానే స్వయంగా భోజనం అందిస్తున్నారు.

- కొండపాక మండలం సిర్సనగండ్ల సర్పంచ్‌ గూడెపు లక్ష్మారెడ్డి ప్రతిరోజు 

 ఐసోలేషన్‌ పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిస్తున్నారు. గ్రామంలోని 

 1250 కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు అందజేశారు. 

- దుబ్బాక మండలంలోని మెడికల్‌ షాపుల సంఘం ఆధ్వర్యంలో కరోనా రోగు

 లకు భోజనం పంపిణీ చేస్తున్నారు.

- దుబ్బాకలో సత్య టిఫిన్‌ సెంటర్‌ యజమాని సత్యానందం ఉదయం వేళ 

 ఉచితంగా కరోనా రోగులకు టిఫిన్‌ అందిస్తున్నారు.

- గజ్వేల్‌లో అన్నదాన మిత్రబృందం, మాజీ కౌన్సిలర్‌ విజయలక్ష్మి, సత్యనారా

 యణ, సత్యసాయి సేవా సమితి, ఎఫ్‌ఎ్‌ఫయూ, నారీసేనల ఆధ్వర్యంలో ప్రతి

 రోజు కొవిడ్‌ పేషెంట్లకు అన్నదానం చేస్తున్నారు. 

బాధిత కుటుంబాల్లో భరోసా

 మెదక్‌లో కరోనాతో చనిపోయిన వారి రెండు కుటుంబాలకు, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలోని మూడు కుటుంబాలకు బ్రిస్సెన్‌ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ.25వేల చొప్పున సాయం అందజేశారు. సంస్థ ప్రతినిధులు రమేష్‌, చందర్‌రావులు బాధితుల ఇళ్లకు వెళ్లి ఆర్థికసహాయం చేశారు. రామాయంపేటలో సీఐ నాగార్జునగౌడ్‌ నేతృత్వంలో సంకల్ప్‌ ఫౌండేషన్‌ తరఫున 16 రోజులుగా ప్రతిరోజు పదిమంది కరోనా బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఇదే సంస్థ తరఫున చిన్నశంకంపేట, రామాయంపేట మండలాల్లోని 12 గ్రామాల్లోని 185 మందికి నిత్యావసర సరుకులను పంచారు. రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లెజితేందర్‌గౌడ్‌ పది మందికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో సక్సెస్‌ యూత్‌ ఆధ్వర్యంలో కరోనా బాధితుల ఇళ్లకు వెళ్లి ఆహారం అందిస్తున్నారు. ఇక శివ్వంపేట మండలంలో జడ్పీటీసీ సభ్యులు పబ్బ మహే్‌షగుప్త కొవిడ్‌తో బాధపడుతున్న వారిని పరామర్శించి నిత్యావసరర వస్తువులు, ఆహారం, మందులు, నగదు సహాయం చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ బృందాలు కూడా భారతి పేరిట జిల్లా వాప్తంగా తమ సేవలను కొనసాగిస్తున్నారు. 65 మంది సేవకులు కలసి మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, మనోహరాబాద్‌, నర్సాపూర్‌లో కరోనా బాధితులకు పళ్లు మందులు పంచుతున్నారు. 45 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  నర్సాపూర్‌లో ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధంగా ఉన్న సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా ప్రతినిధి ఓంకార్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ బాధితులకు సహాయం చేస్తున్నారు. 

 

అంత్యక్రియలు నిర్వహిస్తున్న ముస్లిం యువకులు

కరోనా బారిన పడి చనిపోయిన వారిని సొంత వారే పట్టించుకోని ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఉన్నామంటూ నర్సాపూర్‌ యువకులు సేవలందిస్తున్నారు. నర్సాపూర్‌కు చెందిన జమాత్‌ ఉల్‌ హుఫాజ్‌ కమిటీ సభ్యులైన జమీల్‌, చోటు, వాజిద్‌, ఆశు,షాదుల్లాలు వీరు కులమతాలకతీతంగా సేవలు అందిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నెలక్రితం నర్సాపూర్‌ మండలం మాడాపూర్‌లో కరోనాతో ఒకరు మృతిచెందితే అంత్యక్రియలు చేయడానికి ఎవరూ సాహసించలేదు. ముస్లిం యువకులే దహనసంస్కారాలు నిర్వహించారు. వారం క్రితం శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లిలో వ్యక్తి కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ఎవరూ రాకపోతే అర్ధరాత్రి సమయంలో సర్పంచ్‌ ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే ఆ నలుగురు యువకులు దహనసంస్కారాలు చేశారు. వీరు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సేవలు అందిస్తూ అందరితో మెప్పు పొందుతున్నారు. 





Updated Date - 2021-05-31T05:16:49+05:30 IST