రూ. 2.5 లక్షల విలువైన అల్ర్పాజోలం పట్టివేత
ABN , First Publish Date - 2021-07-08T05:46:35+05:30 IST
మత్తుమందు అల్ర్పాజోలం విక్రయిస్తున్న ఇద్దరినీ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.

ఇద్దరి అరెస్టు.. కేసు నమోదు
మెదక్ అర్బన్, జూలై 7: మత్తుమందు అల్ర్పాజోలం విక్రయిస్తున్న ఇద్దరినీ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మార్కెట్‌లో దీని విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. బుధవారం ఎక్సైజ్ సూపరిండెంటెంట్ ఎం.ఏ. రజాక్ వివరాలను మీడియాకు వెల్లడించారు. కూచన్‌పల్లికి చెందిన గోపినాథ్‌గౌడ్ మెదక్‌లోని ఆటోనగర్‌లో నివాసముంటున్నాడు. పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సురా కృష్ణ ఆధ్వర్యంలో ఉదయం గోపినాథ్‌గౌడ్ ఇంటిపై దాడి చేసి అరకిలో అల్ర్పాజోలంను స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు చిత్రాంజలి కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేసి 5 కిలోల అనుమానాస్పద పదార్థాన్ని స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. శ్రీనివాస్ నుంచి గోపినాథ్‌గౌడ్ మత్తుపదార్థాన్ని కొనుగోలు చేసి, దాన్ని చిన్న ప్యాకెట్లలో నింపి కల్లు కాంపౌండ్లకు విక్రయించేవాడని విచారణలో తేలినట్టు అధికారి వివరించారు. కాగా శ్రీనివాస్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం బొల్లారానికి చెందిన రాజు అనే వ్యక్తి వద్ద నుంచి ఆ పదార్థాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. నిందితులు నేరాన్ని అంగీకరించారని, వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎక్సైజ్ సూపరిండెంటెంట్ వెల్లడించారు.