రూ.2.90 కోట్ల లాటరీ వచ్చిందని రూ.27 లక్షలకు టోపీ
ABN , First Publish Date - 2021-10-30T04:42:54+05:30 IST
లాటరీలో రూ.2.90 కోట్లు వచ్చాయని, ఛార్జీల కింద కొంత సొమ్ము చెల్లించాలని చెప్పి మూడు నెలల్లో రూ. 27లక్షలు వసూలు చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్
నారాయణఖేడ్, అక్టోబరు29: లాటరీలో రూ.2.90 కోట్లు వచ్చాయని, ఛార్జీల కింద కొంత సొమ్ము చెల్లించాలని చెప్పి మూడు నెలల్లో రూ. 27లక్షలు వసూలు చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో జరిగింది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి జూలై 13న గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ప్యాండమిక్ రిలీఫ్ అవార్డు కింద లక్కీడ్రాలో మీ ఫోన్ నంబర్‌కు రూ.2.90 కోట్ల నగదు, ఐఫోన్ బహుమతిగా వచ్చిందని మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ విషయం నిజమేనని నమ్మిన సదరు వ్యక్తి మెసేజ్‌లో తెలిపిన విధంగా వారి ఈ-మెయిల్‌కు తన వివరాలను పంపించాడు. అనంతరం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. బహుమతి మీకు అందజేసే ప్రక్రియను పూర్తిచేయడానికి తనను నియమించారని పరిచయం చేసుకున్నాడు. లక్కీడ్రా ద్వారా వచ్చిన బహుమతి సొమ్మును పొందడానికి ముందు రూ.17లక్షల ఇన్‌కంట్యాక్స్ కట్టాలని చెప్పాడు. అనంతరం పలుమార్లు ఫోన్‌చేసి వివిధ ఛార్జీల పేరుతో గుర్తుతెలియని బ్యాంకుల ఖాతాలతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా రూ.27,08,900 బదిలీ చేయించుకున్నారు. మూడు నెలలు గడుస్తున్నా లాటరీ సొమ్ము అందక పోవ డంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలియజేశారు.