నత్తనడకన రోడ్డు నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2021-11-22T04:33:58+05:30 IST

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

నత్తనడకన రోడ్డు నిర్మాణ పనులు
కొండంరాజుపల్లి - బక్రిచెప్యాల రోడ్డుపై పోసిన కంకర

 పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

 15 గ్రామాల ప్రజలకు తిప్పలు


నంగునూరు, నవంబరు 21: మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలంలోని నాంచారుపల్లి నుంచి బక్రిచెప్యాల, వెల్కటూర్‌ వరకు విస్తరణ పనులు చేపట్టారు. అలాగే నంగునూరు మండలంలోని కోనాయిపల్లి, నర్మెట, రామచంద్రాపురం, నంగునూరు, రామాలయం ముందు నుంచి కొండంరాజుపల్లి, ఖాతా మహాదేవుని ఆలయం మీదుగా మద్దూరు మండలంలోని తోర్నాల వరకు విస్తరణ పనలు చేపట్టారు. ఏడాది క్రితం పీఎంజీఎ్‌సవై రూ.32 కోట్ల నిధులతో 30 కిలోమీటర్ల మేర  చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రోడ్డు మరమ్మతులో భాగంగా గతంలో ఉన్న బీటీ రోడ్డును తవ్వి కంకర పోశారు. నిర్మాణం పూర్తి చేయడంలో జాప్యం వహిస్తుండడంతో ఆ మార్గంగుండా వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు వెంట ఉన్న సుమారు 15 గ్రామాల ప్రజలు రాకపోకలకు తంటాలు పడుతున్నారు. కంకర రోడ్డుపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంగునూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే నరకం చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. అంతేకాకుండా కంకర రోడ్డుపై వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల కురిసిన  వర్షాలకు కంకర రోడ్డు కోతకు గురై మరింత అధ్వానంగా మారిందన్నారు. 


గుత్తేదారుల ఇష్టారాజ్యం 


నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం వహిస్తున్నారు. రోడ్డు మొత్తం ఒకేసారి కంకర పోసి నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రోడ్డు వెంట వెళ్లే రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


 

Updated Date - 2021-11-22T04:33:58+05:30 IST