ధరణితో విప్లవాత్మక మార్పు
ABN , First Publish Date - 2021-10-30T04:41:05+05:30 IST
భూ రికార్డుల చరిత్రలోనే ధరణి పోర్టల్ ఓ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిందని, జిల్లాల్లో ధరణి విజయవంతంగా అమలవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు.

అవాంతరాలు లేకుండా జోరుగా రిజిస్ర్టేషన్లు
పారదర్శకంగా, సజావుగా ప్రక్రియ
ధరణి అమల్లో టాప్‌లో మెదక్ జిల్లా
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హరీశ్, హన్మంతరావు
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తి..
మెదక్‌అర్బన్/సంగారెడ్డిరూరల్, అక్టోబరు29: భూ రికార్డుల చరిత్రలోనే ధరణి పోర్టల్ ఓ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిందని, జిల్లాల్లో ధరణి విజయవంతంగా అమలవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయా జిల్లాల్లోని కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత, కాలయాపనను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి కార్యకలాపాల్లో మెదక్ జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలను అధిగమించి మెదక్ జిల్లాలో జోరుగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయన్నారు. గతంలో జిల్లాలో కేవలం మూడు సబ్‌రిజిస్ర్టేషన్ కార్యాలయాలు మాత్రమే ఉండేవని, ధరణి వచ్చాక జిల్లాలోని 21 తహసీల్దార్ కార్యాలయాల్లో భూములను రిజిస్ర్టేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు. మెదక్ జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 26,640 క్రయవిక్రయాలు, 6,442 గిఫ్ట్ డీడ్‌లు, 3,798 వారసత్వాలు జరిగాయని వివరించారు. 6,678 పెండింగ్ మ్యూటేషన్లను క్లియర్ చేశామని చెప్పారు. 6,238 గ్రీవెన్స్, 2,102 ప్రొబిషన్ లిస్ట్ సమస్యలు, 708 కోర్టు కేసులను పరిష్కరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఽ గతంలో గ్రీవెన్స్‌కు నెలకు దాదాపు 500 ధరణికి సంబంధించిన దరఖాస్తులు వచ్చేవని, నేడు వాటి సంఖ్య 40కి తగ్గిందన్నారు. ఫారెస్టు, రెవెన్యూశాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 3న ప్రజాప్రతినిధులు, సంబంధితశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. వక్ఫ్‌బోర్డు, దేవాదయ భూముల పరిరక్షణకు, అక్రమ కట్టడాలను నిరోధించేందుకు తహసీల్దార్, పోలీస్, ఇంజనీర్, మున్సిపల్, ఫైర్ ఆఫీసర్లతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్, ఆర్డీవో సాయిరాం పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ధరణి ద్వారా 1,06,333 లావాదేవీలు
సంగారెడ్డి జిల్లాలో ధరణి విజయవంతంగా అమలవుతున్నదని కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు. భూ పరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ధరణి ద్వారా 1,06,333 లావాదేవీలు జరిగాయని తెలిపారు. 52,593 భూ రిజిస్ట్రేషన్లు, 5,722 పరిష్కరించిన ఫిర్యాదులు, 15,491 వారసత్వం, పెండింగ్ మ్యుటేషన్లు, 9,939 భూ సంబంధిత ఫిర్యాదులు, 2,302 నాలా, 154 పార్టిషన్, 973 సక్సెషన్ వితౌట్ పీపీబీ (పట్టాదారుపాసుబుక్కు), 108 కోర్టు కేసు పీపీబీ, 52 నాలా వితౌట్ పీపీబీ, 732 జీపీఏ, 998 ల్యాండ్ అక్యూర్డ్, 14,350 నిషేధించిన జాబితా, 2,919 కోర్టు కేసులు, సమాచారం, నిషేధిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నామని స్పష్టం చేశారు. ధరణి సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, ఏవో స్వర్ణలత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
