రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ కొరత లేదు
ABN , First Publish Date - 2021-05-21T05:08:53+05:30 IST
మెదక్ జిల్లాలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌కు కొరత లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని మెగా సంస్థను కోరాం : మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్, మే 20 : మెదక్ జిల్లాలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌కు కొరత లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్ ప్లాంటు లేనందున ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని మెగా సంస్థను కోరామన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో కొవిడ్, ధాన్యం కొనుగోళ్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందమంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 206 మంది కొవిడ్ రోగుల చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 743 మంది కొవిడ్ బాధితులకు రెమ్‌డిసివిర్ ఇంజక్షన్ ఇచ్చామని, ఇంకా 219 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో 3,550 ఆర్టీపీసీఆర్, 2,275 ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 10 మంది డాక్టర్లను, 20 మంది నర్సులను వెంటనే భర్తీ చేసి కొవిడ్ రోగులకు మరింత సేవలను అందించాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కో వ్యాక్సిన్ టీకాలను కొనుగోలు చేస్తున్నదని, ఈ టీకాలు రాగానే 18-45ఏళ్లలోపు వారికి వేస్తామని మంత్రి తెలిపారు.
2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. లారీల కొరత ఉన్నందున హమాలీలు పెట్టుకుని ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలిస్తున్న రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. 25వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్లు తీసుకునేలా చూడాల్సిందిగా రాష్ట్ర పౌర సరఫరా కమిషనర్‌కు సూచించారు. అదేవిధంగా బోదన్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో భద్రపరుస్తున్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని కోరారు. అంతకు ముందు టీఎ్‌సపీఎస్సీ సభ్యుడిగా నియామకమైన ఆర్.సత్యనారాయణను మంత్రి శాలువాతో సత్కరించారు. సమావేశంలో కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ రమేష్, మెదక్ ఎమ్మెల్యే పద్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, టీఎ్‌సపీఎస్సీ సభ్యుడు ఆర్.సత్యనారాయణ, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎ్‌సవో శ్రీనివాస్, డీఎస్పీ కృష్ణమూర్తి, ఆర్డీవో సాయిరాం పాల్గొన్నారు.
రైతులు ఆందోళన చెందొద్దు
హవేళీఘనపూర్ : రైతులు ఆందోళన చెందొద్దు.. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గురువారం మండల పరిధిలోని శమ్నాపూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, సర్పంచ్ నిజ్జని లింగం ఉన్నారు.
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ‘గాంధీ’, ‘కింగ్‌కోఠి’లో ప్రత్యేక వార్డులు
మెదక్ అర్బన్, మే 20 : బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం గాంధీ, కింగ్‌కోఠిలోని ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఆయన పరామర్శించారు. వైద్యులు ఎన్నిసార్లు వచ్చి చెక్ చేస్తున్నారు..సమయానికి మందులు ఇస్తున్నారా.. ఆహారం మంచిగా అందిస్తున్నారా.. వసతులు ఎలా ఉన్నాయా అంటూ కొవిడ్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాస్పతుల్లో ఎక్కడా ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదన్నారు. కరోనా విషయంలో ఎవరూ కూడా అధైర్యపడొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా గాంధీ ఆస్పత్రికి వెళ్లి కొవిడ్ పేషెంట్లతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారన్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.