మందిర నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములవ్వాలి
ABN , First Publish Date - 2021-01-20T06:47:58+05:30 IST
అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని అఖిల భారత సాధుసంత్ రాష్ట్ర ప్రతినిధి, కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్, బర్దీపూర్ ఆశ్రమ ఉత్తరాధికారి డాక్టర్ సిద్దేశ్వర్ స్వామి పిలుపునిచ్చారు.

సంగ్రాం మహరాజ్, సిద్ధేశ్వర్ మహరాజ్
నారాయణఖేడ్, జనవరి 19: అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని అఖిల భారత సాధుసంత్ రాష్ట్ర ప్రతినిధి, కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్, బర్దీపూర్ ఆశ్రమ ఉత్తరాధికారి డాక్టర్ సిద్దేశ్వర్ స్వామి పిలుపునిచ్చారు. నారాయణఖేడ్‌లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆధ్వర్యంలో అన్యక్షేత్రాల సహకారంతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎందరో సాధుసంతులు, రామభక్తులు బలిదానం చేశారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలు నెరవేరి ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరు తమవంతుగా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్ జిల్లా విభాగ్ ప్రచారక్ సత్యనారాయణ, స్థానిక ప్రతినిధి సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంగల్‌పేట దుర్గామాత ఆలయం నుంచి రామాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బర్దీపూర్ ఆశ్రమం తరఫున రూ.లక్ష విరాళాన్ని పీఠం ఉత్తరాధికారి సిద్దేశ్వర్‌స్వామి ప్రకటించారు. కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్ రూ.21 వేలు విరాళంగా అందజేశారు. నిధి సేకరణ తొలిరోజు రూ.4 లక్షలు సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎమ్మెల్యే క్రాంతి విరాళం రూ. 11,111
జోగిపేట, జనవరి 19: శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శప్రాయుడని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పేర్కొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జోగిపేటలో మంగళవారం నిర్వహించిన నిధి సేకరణ రథయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడి పాలన దేశానికి మార్గదర్శనం చేసిందని కొనియాడారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి తనవంతుగా రూ. 11,111 విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు జోగిపేటలో సంఘ్‌పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్‌గుప్తా, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.