నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదు
ABN , First Publish Date - 2021-12-31T17:17:11+05:30 IST
మేం నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదు. మాపై వచ్చిన ఆరోపణలు ఎంతమాత్రం నిజం కాదు. అధికారులు, డైరెక్టర్లపై అభియోగం మోపడం దారుణం.

రామాయంపేట, డిసెంబరు 30 : మేం నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదు. మాపై వచ్చిన ఆరోపణలు ఎంతమాత్రం నిజం కాదు. అధికారులు, డైరెక్టర్లపై అభియోగం మోపడం దారుణం. షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ పంప్ భవన నిర్మాణంలో రూ.60 లక్షల అవినీతి జరిగిందంటూ నోటీసులు పంపటాన్ని నిరసిస్తూ పలువురు డైరెక్టర్లు పురుగుమందు డబ్బాలతో తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండల పరిధి కోనాపూర్ సొసైటీలో కలకలం రేపింది. ఇదివరకే ఈ సొసైటీలో రూ.2 కోట్లకుపైగా కుంభకోణం జరిగిందంటూ అధికారులు నిగ్గు తేల్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 14 మంది డైరెక్టర్లకు డీసీవో పేరిట రెండుసార్లు నోటీసులు అందాయి. నిర్మాణ పనుల్లో జరిగిన దుర్వినియోగంపై సదరు డైరెక్టర్ల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు చర్యలు చేపడతామని నోటీసుల్లో ప్రకటించారు. సొసైటీ చైర్మన్ సూచన మేరకే తాము ప్రతి నిర్మాణ పనుల విషయంలో తీర్మానాలపై సంతకాలు చేశామన్నారు. అయితే తమ నుంచి డబ్బు రికవరీ చేస్తామనడం ఎంతవరకు సమంజసమంటూ అధికారుల తీరును డైరెక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే జరిగితే తాము ఆత్మహత్యలకైనా వెనుకాడబోమన్నారు.