3,54,367 మందికి రైతుబంధు

ABN , First Publish Date - 2021-12-26T05:00:49+05:30 IST

3,54,367 మందికి రైతుబంధు

3,54,367 మందికి రైతుబంధు

సంగారెడ్డి జిల్లాకు రూ.389.55 కోట్లు 

28 నుంచి రైతుల ఖాతాల్లో జమ


సంగారెడ్డిటౌన్‌, డిసెంబరు 25 : యాసంగి సీజన్‌కు రైతుబంధు పంపిణీకి సర్కారు కసరత్తు ప్రారంభించింది. జిల్లా వ్యవసాయ శాఖ లబ్ధిదారుల వివరాల్లో మార్పులు, చేర్పులను పూర్తి చేసింది. ఇదివరకు పెట్టుబడి సాయం పొందినవారితో పాటు ఈ నెల 10 లోపు పట్టాదారు పాసు పుస్తకం పొందినవారు, ధరణిలో నమోదయిన వారు, అర్హులైనా ఇప్పటి వరకు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోని వారిని గుర్తించి లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. కొత్తగా రూపొందించిన జాబితా ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు.


కొత్తగా 28,656 మందికి..

జిల్లాలో మొత్తం 619 గ్రామాల్లో అర్హులైన 3,54,367 మంది రైతులను ఇప్పటికే రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించి సాయం అందజేస్తున్నారు. ఈ నెల 10లోపు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన 28,656 మందికి ఈ  సీజన్‌ నుంచి పెట్టుబడి సాయం అందనున్నది. వీరందరికీ రైతుబంధు అందజేయడానికి రూ.389.54 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఆయా మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఏఈవోలు అర్హులైన రైతుల జాబితాలను సిద్ధం చేశారు.


దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ

ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తున్న సర్కారు యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం ఈ నెల 28 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసే అవకాశం ఉన్నదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు తెలిపారు. అయితే దశలవారీగా రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఎకరం లోపు భూమి కలిగిన రైతులకు మొదటి దశలో, రెండెకరాలలోపు ఉన్నవారికి రెండో దశలో, మూడెకరాల లోపు భూమి ఉన్నవారికి మూడో దశలో, నాలుగెకరాల లోపు వారికి నాల్గవ దశలో, 5 ఎకరాల లోపు వారికి ఐదో దశలో, ఐదెకరాలు మించిన రైతులకు ఆ తరువాత సాయం మంజూరు చేయనున్నారు. 

Updated Date - 2021-12-26T05:00:49+05:30 IST