ఆకాశంలో మబ్బులు.. అన్నదాతకు గుబులు

ABN , First Publish Date - 2021-11-03T04:56:04+05:30 IST

ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాత గుండెల్లో గుబులు మొదలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో అకాలవర్ష సూచనలు ఏమిటని ఆందోళన మొదలైంది. జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. పెద్దమొత్తంలో ధాన్యం కొనుగోలు సెంటర్లకు వస్తున్నది. చేతికి వచ్చిన పత్తిని ఏరుతున్నారు. ఈ దశలో సోమవారం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో రైతన్న గుండె చెదురుతున్నది. వర్షం వస్తే చేతికొచ్చిన వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మబ్బులు

ఆకాశంలో మబ్బులు.. అన్నదాతకు గుబులు
అర్జున్‌పట్ల గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలు

రెండ్రోజులుగా మేఘావృతమైన ఆకాశం 

అకాల వర్షం వస్తే వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం


సిద్దిపేట అగ్రికల్చర్‌, నవంబరు 2: ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాత గుండెల్లో గుబులు మొదలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో అకాలవర్ష సూచనలు ఏమిటని ఆందోళన మొదలైంది. జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. పెద్దమొత్తంలో ధాన్యం కొనుగోలు సెంటర్లకు వస్తున్నది. చేతికి వచ్చిన పత్తిని ఏరుతున్నారు. ఈ దశలో సోమవారం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో రైతన్న గుండె చెదురుతున్నది. వర్షం వస్తే చేతికొచ్చిన వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మబ్బులు కమ్ముకురావడంతో  ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు చేర్చిన ధాన్యాన్ని రాసులుగా చేసి టార్పాలిన్‌ కవర్లు కప్పుకున్నారు. కానీ వర్షం వస్తే పొలంలో ఉన్న వరి నేలకొరుగుతుందని, గింజలు మొలక వస్తాయని వాపోతున్నారు. మరోవైపు చేలలో పత్తికాయలు పగిలి ఏరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూలీల కొరతతో పత్తి తీయడం నెమ్మదిగా సాగుతున్నది.  వర్షం కురిస్తే పత్తి తడిసి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అధిక  వర్షాలకు ఇప్పటికే పత్తి దెబ్బతిన్నది. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి రావల్సిఉండగా 5 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నది. వర్షం పడితే అదికూడా చేతికిరాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తికి ధర ఎక్కువగా ఉండటం రైతులకు ఊరటనిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రూ. 2వేల నుంచి రూ. 2,500 వరకు అధిక ధర పలుకుతున్నది. దీంతో లాభం రాకపోయినా పెట్టుబడులైనా తిరిగివస్తాయని రైతులు ఆశతో ఉన్నారు. వరి కోతలు, పత్తి తీయడం ముగిసేవరకు వర్షం రాకుండా కరుణించాలని  రైతులు వరుణుడిని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-11-03T04:56:04+05:30 IST