టీఎ్‌సపీఎస్సీ సభ్యుడిగా ఆర్‌.సత్యనారాయణ

ABN , First Publish Date - 2021-05-20T06:06:24+05:30 IST

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.

టీఎ్‌సపీఎస్సీ సభ్యుడిగా ఆర్‌.సత్యనారాయణ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 19 : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈనాడు, ఉదయం, వార్త దినపత్రికల్లో జిల్లా రిపోర్టర్‌గా కర్నూల్‌, కడప, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, సంగారెడ్డిలో పని చేసిన సత్యనారాయణ 2007లో జరిగిన కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సాధనలో భాగంగా అధినేత కేసీఆర్‌ పిలుపు మేరకు ఏడాదిన్నరకే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉద్యమకాలంలో ఆయన టీఆర్‌ఎస్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ నుంచి పోటీచేసిన కేసీఆర్‌కు ఆయన ఎన్నికల ఏజెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలోనూ, 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మెదక్‌ పార్లమెంట్‌ నుంచి పోటీచేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డికి కూడా ఆయన ఎన్నికల ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న సత్యనారాయణకు పుష్కరకాలానికి పైగా నిరీక్షణ అనంతరం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యత్వం దక్కింది. ఈ పదవిలో ఆయన ఆరేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తానని తెలిపారు.

Updated Date - 2021-05-20T06:06:24+05:30 IST