ఏం తేల్చుతారో!
ABN , First Publish Date - 2021-01-20T06:50:09+05:30 IST
జహీరాబాద్ డివిజన్ పరిధిలో అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం 2013లో కాంగ్రెస్ హయాంలో రూ.1,050 కోట్ల అంచనాతో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

జహీరాబాద్ నిమ్జ్ ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ
ఎనిమిదేళ్లుగా నత్తనడకన భూసేకరణ
17 గ్రామాల్లో 12,635 ఎకరాల గుర్తింపు
సేకరించింది 2,964 వేల ఎకరాలే
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 19: జహీరాబాద్ డివిజన్ పరిధిలో అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం 2013లో కాంగ్రెస్ హయాంలో రూ.1,050 కోట్ల అంచనాతో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో 12,635 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో 10 వేల ఎకరాలు పట్టా భూములు కాగా, 2 వేల ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూమి. 2016లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా న్యాల్‌కల్ మండలంలోని రుక్మాపూర్, ముంగి గ్రామాలను, ఝరాసంగం మండలంలోని బర్దిపూర్, చీలేపల్లి, ఎల్గొయి గ్రామాల్లో 4,543 ఎకరాల భూసేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 2,940 ఎకరాలను సేకరించారు. మరో 68 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా న్యాల్‌కల్ మండలంలోని హద్నూర్, మల్కన్‌పాడ్, రేజింతల్, న్యామతాబాద్, గంగ్వార్, మెటల్‌కుంట, బసంతాపూర్, కల్‌బెమల్, మామిడ్గి, గణే్‌షపూర్, హుసెల్లి, గుంజేటి తదితర గ్రామాల్లోని 375 సర్వే నంబర్లలో 9,635 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో పట్టా భూమి 6,184 ఎకరాలు ఉండగా ప్రభుత్వ భూమి 2,209 ఎకరాలు ఉంది.
పరిహారంపై అసంతృప్తి
నిమ్జ్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు రెండు రకాలుగా పరిహారం అందజేశారు. పట్టా భూములకు ఎకరాకు రూ.5.65 లక్షలు, సేద్యంలో ఉన్న అసైన్డ్ భూమికి రూ.4 లక్షలు, బీడు భూములకు రూ. 3.25 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. మొదటి విడతలో సేకరించిన భూమికి ఇప్పటి వరకు రైతులకు రూ.150 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో పట్టా భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతున్నదని, అందుకు అనుగుణంగా చెల్లిస్తేనే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.15 లక్షలు చెల్లించాలని పట్టుబడుతున్నారు. లేదంటే భూమికి బదులుగా సాగుకు అనువైన భూమినే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిహారం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రైవేటు భూములకు ఎకరాకు రూ.9 లక్షలు చెల్లించేందుకు అంగీకరించింది. అసైన్డ్ భూములకు రూ.4.25 లక్షలు చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. సేకరించిన భూమిలో పరిహారం చెల్లించాల్సి ఉన్న 68 ఎకరాలతో పాటు ఇంకా సేకరించాల్సిన 9,635 ఎకరాలకు ఇదే లెక్కతో చెల్లించేందుకు స్ధిమయ్యారు. అయినా ఈ ధరకు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. తాము చెప్పిన ధర చెల్లించాలని, పునరావాసం కల్పించి, కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పర్యావరణ నివేదికపై అభ్యంతరాలు
నిమ్జ్ ఏర్పాటుతో పర్యావరణంపై చూపే ప్రభావంపై ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ నివేదికను రూపొందించింది. అయితే ఈ నివేదికలో పేర్కొన్న ప్రతీ పదం ఇతర సంస్థలకు అనుమతి కోసం పంపించిన పర్యావరణ నివేదికలోనిదే కాపీ చేశారని పర్యావరణ వేత్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇలా చేయడం ప్రజల హక్కులపై దాడి చేయడమేనని వారు మండిపడుతున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం చిత్తశుద్ధితో కొత్తగా నివేదికను రూపొందించిన తర్వాతే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డాక్టర్ కె.బాపురావు, డాక్టర్ కె.వెంకట్‌రెడ్డి తదితరులతో కూడిన ‘ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం’ అభిప్రాయపడింది.