ప్రాధాన్య రంగాలకు రుణాలు అందించాలి
ABN , First Publish Date - 2021-03-25T05:23:33+05:30 IST
సిద్దిపేట జిల్లా అన్నిరకాలుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, అలాగే అవసరమైన రంగాలకు ప్రభుత్వం తరఫున అందించే రుణాలు ప్రాధాన్య క్రమంలో ఇవ్వాలని అదనపు కలెక్టర్ పద్మాకర్ బ్యాంకర్లు, అధికారులకు సూచించారు.

అదనపు కలెక్టర్ పద్మాకర్
సిద్దిపేట సిటీ, మార్చి 24 : సిద్దిపేట జిల్లా అన్నిరకాలుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, అలాగే అవసరమైన రంగాలకు ప్రభుత్వం తరఫున అందించే రుణాలు ప్రాధాన్య క్రమంలో ఇవ్వాలని అదనపు కలెక్టర్ పద్మాకర్ బ్యాంకర్లు, అధికారులకు సూచించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాస్థాయి రివ్యూ మీటింగ్, జిల్లా కన్సల్‌టేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ అభియాన్‌లో భాగంగా స్వానిధి రుణాలను నిర్దేశించిన లక్ష్యం మేరకు మంజూరు చేసిన బ్యాంకు అధికారులకు అభినందనలు తెలిపారు. అనంతరం డీఆర్డీవో గోపాలరావు మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలకు 106 శాతం రుణాలను అందించిన బ్యాంకు అధికారులను ప్రశంసించారు. సిద్దిపేట జిల్లా రెండేళ్లుగా మొదటిస్థానంలో నిలిచిందని, ఈ ఆర్థిక సంవత్సరం మరిన్ని రుణాలను అందించి ప్రథమస్థానంలో నిలబెట్టాలని బ్యాంకు అధికారులను కోరారు.
ఆయిల్ పామ్ సాగుచేసే మంచి వారికి అవకాశం
మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో మన జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుచేయడం మంజూరైందని, త్వరలోనే రైతులను ఎంపిక చేస్తామని పద్మాకర్ తెలిపారు. అదేవిధంగా పీఎం సురక్ష భీమా యోజన పాలసీదారుడైన అంకం రాజమౌళి పది నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించాడు. అతని నామినీ అయిన అంకం రంజిత్‌కు రూ.2 లక్షల సాధారణ భీమాతో పాటు మరణించే కంటే 90 రోజుల ముందు ఏటీఎం వినియోగించుకున్నందుకు మరో రూ.2 లక్షల భీమా చెక్కును అదనపు కలెక్టర్ అందజేశారు. ఈ సమావేశంలో మెప్మా అధికారులు, యూనియన్ బ్యాంకు రీజినల్ మేనేజర్ శంకర్‌లాల్, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ లక్ష్మీప్రసాద్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.