15 నుంచి 18 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-12-29T05:15:27+05:30 IST

దేశంలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

15 నుంచి 18 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

జనవరి 3 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయం

మెదక్‌ జిల్లాలో దాదాపు 35 వేల మంది

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 28: దేశంలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల వారికి కొవిడ్‌ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జనవరి 3 నుంచి టీనేజర్లకు వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పీహెచ్‌సీ పరిధిలోని 15 నుంచి 18 ఏళ్ల వారి వివరాలను సేకరిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులతో పాటు ఆ వయస్సు గల టీనేజర్లకు టీకా ఇవ్వనున్నారు. 60ఏళ్లు దాటి, ఇతర అనార్యోగ సమస్యలున్న వారికి వైద్యుల సలహాపై ముందు జాగ్రత్తగా(ప్రికాషన్‌) డోసు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. 60 ఏళ్ల పైబడిన వారు 2,09,080 మంది టీకా తీసుకున్నారు. వీరిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఆరోగ్య సిబ్బందికి 10వ తేదీ నుంచి టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జిల్లాలో వైద్యులు, సూపర్‌వైజర్లు, ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం రెండు వేలకు పైగా ఉన్నారు.

మెదక్‌ జిల్లాలో లెక్క తేల్చిన అధికారులు

మెదక్‌ జిల్లాలో 15 నుంచి 18 ఏళ్లలోపు వారు 35 వేల మంది ఉంటారని వైద్యాధికారుల అంచనా. జిల్లాలో మొత్తం 7,68,530 జనాభా ఉన్నారు. ఇందులో 18 ఏళ్లు నిండిన వారి దాదాపు ఆరు లక్షలలోపు ఉండగా... 0-18 ఏళ్ల లోపు వారు సుమారు రెండు లక్షల లోపు ఉన్నారు. జిల్లాలో 5.48 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఫస్ట్‌ డోసు 5,74,760 మందికి... సెకండ్‌ డోసు 3,95,192 మందికి వేశారు 

సంగారెడ్డి జిల్లాలో 1.5 లక్షల మంది

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 28: సంగారెడ్డి జిల్లాలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన వారికి టీకా ఇచ్చేందుకు వైద్యాధికారులు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో 15-18 ఏళ్ల వయస్సు కలిగిన వారు         సుమారు 1.5 లక్షల మంది, హెల్త్‌కేర్‌ వర్కర్లు 10,388 మంది, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు సుమారు 1.6 లక్షల మంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా సంగారెడ్డి జిల్లాలో           టీకా పంపిణీకి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-12-29T05:15:27+05:30 IST