నేడు పోలింగ్
ABN , First Publish Date - 2021-12-10T05:05:14+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి శుక్రవారం నిర్వహించినున్న పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు సర్వం సిద్ధం
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్
ఓటు వేయనున్న 1,026 మంది ప్రజాప్రతినిధులు
ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు
ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్, వీడియో రికార్డింగ్
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్, డిసెంబరు 9 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి శుక్రవారం నిర్వహించినున్న పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. మెదక్‌లోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బంది గురువారం బ్యాలెట్ బాక్సులను, పోలింగ్ సామగ్రిని తీసుకొని వారికి కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమాసింగ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంగారెడ్డిలో 4, మెదక్‌లో 3, సిద్దిపేటలో 2 చొప్పున మొత్తం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,026 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషులు 454, మహిళలు 572 మంది ఉన్నారు. జడ్పీటీసీలు 60, ఎంపీటీసీలు 635, కౌన్సిలర్లు 318, ఎక్స్ అఫీషియో సభ్యులు 13 మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో పాటు వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి మైక్రోఅబ్జర్వర్, సెక్టోరియల్ ఆఫీసర్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించారు. మొత్తం 75 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 463 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. 9 రూట్ మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణం మధ్య పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతీ ఒక్కరు ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఓటు వేయనున్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలున్నారు. ఇందులో ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి సూర్యపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా నమోదు చేసుకున్నారు. ఇక జహీరాబాద్ కోర్టు కేసు కారణంగా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. దీంతో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎక్కడా నమోదు చేసుకోలేదు. వీరు మినహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాలల్లో ఓటు వేయనున్నారు. ఎమ్మెల్సీ ఫారుక్‌హుస్సేన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవిన్‌రెడ్డి నారాయణ్‌ఖేడ్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. వారిద్దరూ అక్కడ ఓటు వేయనున్నారు.
బరిలో ఉన్న అభ్యర్థులు 3
తూర్పు నిర్మలాజగ్గారెడ్డి(కాంగ్రెస్), వంటేరి యాదవరెడ్డి (టీఆర్‌ఎస్), మట్ట మల్లారెడ్డి (స్వతంత్ర)
మొత్తం ఓటర్లు 1,026
జడ్పీటీసీలు 60, ఎంపీటీసీలు 635, కౌన్సిలర్లు 318,
ఎక్స్ అఫీషియో ఓటర్లు 13
మొత్తం పోలింగ్ కేంద్రాలు 9
సంగారెడ్డి జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 3
మొత్తం పోలింగ్ సిబ్బంది 75
బందోబస్తు నిర్వహించనున్న పోలీసులు 463
