ప్రకృతి అందాల నెలవు పోచారం
ABN , First Publish Date - 2021-11-06T04:57:52+05:30 IST
పక్షుల కిలకిలరవాలు.. పొంగిపొర్లుతున్న ఆనకట్ట గలగలలు.. చెంగున ఎగిరే వన్యప్రాణులు.. నలుదిక్కులా పచ్చదనంతో ప్రకృతి అందాలకు నెలవుగా విలసిల్లుతున్నది పోచారం. ఇక్కడి అభయారణ్యంలో ఏర్పాటు చేసిన జింకల పార్క్, వనవిజ్ఞాన కేంద్రం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో హవేళిఘణపూర్ మండలంలోని పోచమ్మరాల్ గ్రామ శివారులో పోచారం ప్రాజెక్టు ఉంది. జూలై మాసం నుంచి ఈ డ్యాం పొంగిపొర్లుతున్నది. మొదట్లో వరద తాకిడి ఎక్కువగా ఉండటంతో సందర్శకులకు అనుమతివ్వలేదు. ప్రస్తుతం వరద తగ్గడంతో వారాంతా

నిండుకుండలా ఆనకట్ట
అభయారణ్యంలో కనువిందు చేస్తున్న వన్యప్రాణులు
హవేళిఘణపూర్, నవంబరు 5: పక్షుల కిలకిలరవాలు.. పొంగిపొర్లుతున్న ఆనకట్ట గలగలలు.. చెంగున ఎగిరే వన్యప్రాణులు.. నలుదిక్కులా పచ్చదనంతో ప్రకృతి అందాలకు నెలవుగా విలసిల్లుతున్నది పోచారం. ఇక్కడి అభయారణ్యంలో ఏర్పాటు చేసిన జింకల పార్క్, వనవిజ్ఞాన కేంద్రం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో హవేళిఘణపూర్ మండలంలోని పోచమ్మరాల్ గ్రామ శివారులో పోచారం ప్రాజెక్టు ఉంది. జూలై మాసం నుంచి ఈ డ్యాం పొంగిపొర్లుతున్నది. మొదట్లో వరద తాకిడి ఎక్కువగా ఉండటంతో సందర్శకులకు అనుమతివ్వలేదు. ప్రస్తుతం వరద తగ్గడంతో వారాంతాలు, సెలవుల్లో పర్యాటకులు వస్తున్నారు. యువత ఈత కొడుతూ.. సెల్ఫీలు, ఫొటోలతో దిగుతున్నారు. డ్యాం పక్కనే అభయారణ్యం ఉండటంతో సెలవుదినాల్లో జిల్లా నుంచే కాకుండా సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. అలుగు చివరి ప్రాంతంలోని నీటిలో మువకులు ఈత కొడుతుండగా, చిన్నారులు పెద్దలు నీళ్లలో ఆడుతూ ఫొటోలు దిగుతుంటారు. పోచారం ఆనకట్ట అందాలను చూసిన తరువాత సమీపంలోనే ఉన్న పార్కు వద్దకు పర్యాటకులు వస్తారు. ఇక్కడ ఉన్న చిన్నారులు ఆటలాడుతుండగా పెద్దలు సేదతీరుతారు. నూతనంగా నిర్మించిన జంతు విజ్ఞాన కేంద్రం ఆకట్టుకుంటుంది.
పచ్చని పందిరిలా అభయారణ్యం
పోచారం అరణ్యం అపారమైన వృక్ష, జంతుజాతులకు నిలయం. 1989లో అభయారణ్యం పరిధిలోని పర్యావరణ పర్యాటక కేంద్రంలో 158 హెక్టార్లల్లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని రెండు బ్లాకులుగా విభజించారు. ఒకటో బ్లాక్ 124 హెక్టార్లు, రెండో బ్లాక్‌లో 34 హెక్టార్లలో విస్తిరించి ఉంటుంది. ఈ అడవిలో ప్రస్తుతం చుక్కలదుప్పులు, మనుబోతులు, సాంబార్ దుప్పులు, కొండ గొర్రెలు, జింకలు, నెమళ్లు, అడవిపందులు, ఎలుగుబంట్లలతో పాటు వివిధ రకాలు పక్షులు ఉన్నాయి. గతేడాది ఇక్క మూషిక జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పర్యాటకులు అభయారణ్యం అందాలను వీక్షించేందుకు వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ప్రకృతి అందాలను తిలకించేందుకు వాచ్‌టవర్‌ను సైతం ఏర్పాటు చేయడం విశేషం.