దేశంలో నంబర్‌ వన్‌ పోలీసింగ్‌

ABN , First Publish Date - 2021-12-25T05:52:17+05:30 IST

దేశంలో నంబర్‌ వన్‌ అంటే తెలంగాణ పోలీసులని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేటలో మోడల్‌ పోలీస్‌ కన్వెన్షన్‌ హాల్‌ను మంత్రి హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు.

దేశంలో నంబర్‌ వన్‌ పోలీసింగ్‌
పోలీస్‌ కన్వెన్షన్‌హాల్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు

సిద్దిపేటను హైటెక్‌ సిటీగా మార్చిన మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ


సిద్దిపేట క్రైం, డిసెంబరు 24 : దేశంలో నంబర్‌ వన్‌ అంటే తెలంగాణ పోలీసులని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేటలో మోడల్‌ పోలీస్‌ కన్వెన్షన్‌ హాల్‌ను మంత్రి హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, సహకారంతోనే మోడల్‌ పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేగంగా నిర్మాణం అయ్యిందన్నారు. ప్రతీ జిల్లాలో సిద్దిపేట లాంటి మోడల్‌ పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు కావాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్‌ అంటే భయం ఉండేదని ప్రత్యేక  తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో గౌరవం పెరిగిందని తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటను హైటెక్‌ సిటీ తరహా అభివృద్ధి చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా పోలీస్‌శాఖను తీర్చిదిద్దామన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాత్రి పగలు తేడాలేకుండా కష్టపడి పనిచేసే శాఖ పోలీస్‌ శాఖనే అని అన్నారు. వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మోడల్‌ పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించామన్నారు. దీని ద్వారా వచ్చే ప్రతీ రూపాయి పోలీసుల సంక్షేమానికే వెచ్చిస్తామని పేర్కొన్నారు. ఈ సెంటర్‌ను వేగంగా నిర్మించేందుకు కృషి చేసిన సీపీ జోయల్‌ డేవిస్‌, కాంట్రాక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, ప్రతీ జిల్లాలో ఇలాంటి సెంటర్‌ నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, సీపీ జోయల్‌ డేవిస్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-12-25T05:52:17+05:30 IST