పనిచేయని సర్వర్‌.. నిలిచిపోయిన రేషన్‌ బియ్యం పంపిణీ!

ABN , First Publish Date - 2021-07-09T05:08:27+05:30 IST

ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనున్నట్లు ప్రకటించిన సమయానికి... ఒకరోజు ముందే సేవలు నిలిచిపోయాయి

పనిచేయని సర్వర్‌..  నిలిచిపోయిన రేషన్‌ బియ్యం పంపిణీ!

ఒకరోజు ముందే నిలిచిపోయిన సేవలు..

లబ్ధిదారులకు తప్పని తిప్పలు

శుక్రవారం నుంచి ఆదివారం వరకు సర్వర్‌ బిజీ!


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూలై 8: ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనున్నట్లు ప్రకటించిన సమయానికి... ఒకరోజు ముందే సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా సర్వర్‌ పనిచేయకపోవడంతో గురువారం మెదక్‌ జిల్లాలో రేషన్‌బియ్యం పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలోని రేషన్‌ దుకాణాల్లో ఉదయం 11 గంటల వరకు సర్వర్‌ పని చేసింది. ఆ తరువాత సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్‌ పనిచేయలేదు. దీంతో రేషన్‌ బియ్యం సరఫరా నిలిచిపోయింది. జూలైకి సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీ ఈనెల ఐదో నుంచి ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2.13 లక్షల మంది రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. 521 చౌకధరల దుకాణాల ద్వారా వీరికి ప్రతినెలా ఒకటో తేదీ నుంచి బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈనెలలో కూడా ప్రభుత్వం పేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. దీంతో దుకాణాల దగ్గర రద్దీ కూడా పెరిగింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా గురువారం సర్వర్‌ పనిచేయకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ రోజంతా దుకాణాల వద్ద పడిగాపులు గాశారు. రాష్ట్రం మొత్తం శుక్రవారం నుంచి ఆదివారం వరకు సర్వర్‌ పనిచేయదని అధికారులు ప్రకటించారు. కానీ మెదక్‌ జిల్లాలో మాత్రం ఒకరోజు ముందు నుంచే సర్వర్‌ పనిచేయకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారుల దృష్టికి తీసుకురాగా సివిల్‌ సప్లయ్‌ సర్వర్లు పనిచేయని విషయం దృష్టికి రాలేదన్నారు. 

Updated Date - 2021-07-09T05:08:27+05:30 IST