ఆఫీసు లేదు.. ఆఫీసరు లేడు..!

ABN , First Publish Date - 2021-11-01T04:57:46+05:30 IST

నర్సాపూర్‌, అక్టోబరు 31: ప్రజలంతా పోరాటంచేసి నర్సాపూర్‌ కేంద్రంగా డివిజన్‌ సాధించుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. డివిజన్‌ కేంద్రంగా ఏర్పడినా ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. వచ్చిన ఒకేఒక్క డివిజన్‌స్థాయి కార్యాలయమైన ఆర్డీవో కార్యాలయం కూడా ఇప్పుడు నిరుపయోగంగా మారింది. కార్యాలయం ఉన్నా పూర్తిస్థాయి ఆర్డీవో లేకపోవడంతో కార్యాలయం బోసిపోతున్నది. నర్సాపూర్‌ ఆర్డీవోగా ప్రస్తుతం ఇన్‌చార్జి అధికారిగా మెదక్‌ ఆర్డీవో సాయిరాం వ్యవహరిస్తున్నారు

ఆఫీసు లేదు.. ఆఫీసరు లేడు..!

పేరుకే నర్సాపూర్‌ డివిజన్‌ కేంద్రం 

ఉన్న ఒక్క ఆర్డీవో ఆఫీసులో అధికారి లేడు

అద్దె భవనాల్లోనే ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు


నర్సాపూర్‌, అక్టోబరు 31: ప్రజలంతా పోరాటంచేసి నర్సాపూర్‌ కేంద్రంగా డివిజన్‌ సాధించుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. డివిజన్‌ కేంద్రంగా ఏర్పడినా ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. వచ్చిన ఒకేఒక్క డివిజన్‌స్థాయి కార్యాలయమైన ఆర్డీవో కార్యాలయం కూడా ఇప్పుడు నిరుపయోగంగా మారింది. కార్యాలయం ఉన్నా పూర్తిస్థాయి ఆర్డీవో లేకపోవడంతో కార్యాలయం బోసిపోతున్నది. నర్సాపూర్‌ ఆర్డీవోగా ప్రస్తుతం ఇన్‌చార్జి అధికారిగా మెదక్‌ ఆర్డీవో సాయిరాం వ్యవహరిస్తున్నారు. ఆయన ఎదైనా అత్యవసరమైనప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఇతర రోజుల్లో ఆర్డీవో కార్యాలయం బోసిపోతున్నది. నర్సాపూర్‌లో డివిజన్‌ కార్యాలయ అక్టోబరు 2016లో ఏర్పాటు చేశారు. అప్పటి మెదక్‌ ఆర్డీవో నగే్‌షకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. 2017లో పూర్తిస్థాయి ఆర్డీవోగా వెంకటేశ్వర్లు వచ్చారు. ఆయన రెండు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ఆయన బదిలీ కావడంతో 2019లో అరుణారెడ్డి రెగ్యులర్‌ అధికారిగా వచ్చినా కొన్నాళ్లకే ఆమె సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆమె స్థానంలో మెదక్‌ ఆర్డీవో సాయిరాంను ఇన్‌చార్జిగా నియమించారు. ఎనిమిది నెలల క్రితం రవీందర్‌రెడ్డిని రెగ్యులర్‌ ఆర్డీవోగా నియమించినా ఆయన నెలరోజులు మాత్రమే పనిచేసి హుజురాబాద్‌ ఆర్డీవోగా బదిలీ అయ్యారు. దీంతో మరోసారి మెదక్‌ ఆర్డీవో సాయిరాంకే బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. ఆయన జిల్లాకేంద్రమైన మెదక్‌ ఆర్డీవోగా ఉండటంతో పనిభారంతో నర్సాపూర్‌కు పూర్తిస్థాయి సమయం కేటాయించడం లేదు. ఆర్డీవో కార్యాలయంలో పూర్తిస్థాయి సిబ్బంది కూడా లేకపోవడంతో కార్యాలయం ఉన్నా లాభం లేకుండాపోయిందని ప్రజలు బాధపడుతున్నారు. డివిజన్‌ ఏర్పాటుచేసే సమయంలో అన్ని డివిజన్‌స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పినా ఆచరణలో మాత్రం ఒక్క ఆఫీసును కూడా తేలేకపోయారు. ఉన్న ఒక్క ఆర్డీవో కార్యాలయంలోనూ పూర్తిస్థాయి అధికారిని నియమించేలా ఒత్తిడి తేలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 

తహసీల్దార్‌ కూడా ఇన్‌చార్జియే..

నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌ తహసీల్దార్‌ కూడా రెగ్యుల్‌ అధికారి కాకపోవడం విశేషం. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన మాలతి ఈ మధ్యనే ఏర్పడిన మాసాయిపేట మండలానికి తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో మరొకరిని రెగ్యులర్‌ అధికారిని నియమించకుండా ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పనిరచేస్తున్న తబితకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో రెండుచోట్ల విధులు నిర్వహించడంలో సఫలం కాలేకపోతున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యత కూడా అప్పగించడంతో పలుమార్లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నియోజకవర్గ కేంద్రం, డివిజన్‌ కేంద్రమైన నర్సాపూర్‌కు రెగ్యులర్‌ తహసీల్దార్‌ విడ్డురంగా ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. 

సొంత భవనాలు కరువు

నర్సాపూర్‌లో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంతోపాటు తహసీల్దార్‌ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో పశుసంవర్ధకశాఖకు చెందిన భవనంలో కొనసాగిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాన్ని నీటిపారుదల శాఖ అతిథిగృహంలో నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే తహసీల్దార్‌ కార్యాలయాన్ని ప్రజలకు ఏమాత్రం సౌకర్యంగాలేని ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో వివిధ పనుల మీద కార్యాలయానికి వెళ్వేవారు పడరానిపాట్లు పడుతున్నారు. వృద్ధులు, వికలాంగులు, వాహనాలు లేనివారు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత తహసీల్దార్‌ కార్యాలయం శిథిలావస్తకు చేరిందని, ఆ భవనాన్ని తొలగించి కొత్తడి నిర్మిస్తామని ప్రకటించారు. కానీ అనంతరం ఆ స్థలాన్ని సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి కేటాయించడంతో తహసీల్దార్‌ ఆఫీసు కట్టడానికి స్థలం లేకుండా పోయింది. ప్రస్తుతం కొనసాగిస్తున్న అతిథిగృహంలో కూడా సరిపడా గదులు లేకపోవడంతో సిబ్బంది ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-11-01T04:57:46+05:30 IST