విద్యార్థుల భవితకు ‘నవోదయం’

ABN , First Publish Date - 2021-11-29T05:07:28+05:30 IST

గ్రామీణ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఉజ్వల భవితకు సోపానం నవోదయ విద్యాలయం.

విద్యార్థుల భవితకు ‘నవోదయం’
వర్గల్‌ కేంద్రంలోని జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రాంగణం

వచ్చే విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం 

దరఖాస్తుల స్వీకరణకు రేపే ఆఖరు రోజు

ఉమ్మడి జిల్లా వారిగా ప్రవేశాలు

వర్గల్‌, నవంబరు 28 : గ్రామీణ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఉజ్వల భవితకు సోపానం నవోదయ విద్యాలయం. ప్రతిభ కలిగిన విద్యార్థులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి, మెరుగైన విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం జవహర్‌ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నామమాత్రపు ఫీజుతో విద్యాబోధన అందిస్తున్నారు. ఇక్కడ త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తుండడంతో విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాషల పట్ల మంచి పట్టు లభిస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం 2022-23లో 6వ తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్షకు నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నవంబరు 30తో ఈ గడువు ముగియనున్నది. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్‌ 30వ తేదీ 2022 శనివారం ఎంట్రెన్స్‌ టెస్టును నిర్వహించనున్నారు. అందుకోసం ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు ముందుగా నవోదయ విద్యాలయ సమితి వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ, జీవోవి.ఇన్‌లో తల్లిదండ్రుల సమక్షంలో తగిన వివరాలను ఎంటర్‌ చేయాలి. విద్యార్థి పాస్‌ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ధ్రువీకరణ చేయించి ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అప్లికేషన్‌ సమర్పించు సమయంలో విద్యార్థి 3వ, 4వ, 5వ తరగతుల పాఠశాల వివరాలు సరిగ్గా ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత అడ్మిట్‌ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక పరీక్షలో అర్హులకు 6వ తరగతి ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 80 సీట్లకుగాను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ విద్యార్థులకు 25 శాతం సీట్లను రిజర్వు చేస్తారు. అందులో వికలాంగులకు 3 శాతం, షెడ్యూల్‌ కులాలకు 15 శాతం, షెడ్యూల్‌ తెగలకు 7 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. మొత్తంలో బాలికలకు 33 శాతం సీట్లు రిజర్వు చేస్తారు. ఎంపిక పరీక్షలో 50 శాతం మేధాశక్తి, 50 శాతం గణితం, భాషా సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అబ్జెక్టివ్‌ టైప్‌లో ఉండే ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. నవోదయలో 6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే నివాసం ఉండాలి. జిల్లాలోనే 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. తేదీ 1-5-2009 నుంచి 30-4-2013 తేదీ మధ్య జన్మించి ఉండాలి. 

ఆహ్లాదకర వాతావరణంలో వర్గల్‌ విద్యాలయం

ఉమ్మడి మెదక్‌ జిల్లా (సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌) జిల్లాలకు కలిపి ఉన్నది ఒకే నవోదయ విద్యాలయం. అది సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండల కేంద్రంలో ఉన్నది. ఇందులో 80 మంది విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయి. పూర్వం వర్గల్‌ నవోదయ విద్యాలయం 30 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పాటు చేశారు. నందనవనాన్ని తలపించే వృక్ష సంపద, అధునాతన భవనాలు, చక్కటి సౌకర్యాలు, ఆశ్రమ వసతులు, స్మార్ట్‌ క్లాస్‌లు, నిష్ణాతులైన అధ్యాపక బృందం, విశాలమైన క్రీడా మైదానంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యాలయం ఉన్నది. అంతర్గత సీసీరోడ్లు, స్ర్టీట్‌ లైట్లు, విద్యుత్‌ అంతరాయం లేకుండా జనరేటర్‌ సౌకర్యం కల్పించారు. ఇక్కడ సీబీఎ్‌సఈ సిలబస్‌ ప్రకారం 6 నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన చేస్తారు. పూర్తిస్థాయిలో రెసిడెన్షియల్‌ వసతులు కలిగిన విద్యాలయంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ, స్డడీ అవర్స్‌ కొనసాగుతాయి. విద్యార్థుల్లో జాతీయ సమైక్యతా భావం పెంపొందింపజేసేందుకు మైగ్రేషన్‌ విధానాన్ని అమలుచేస్తారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులను ఏడాది పాటు హిందీయేతర రాష్ట్రాల నవోదయకు పంపుతారు. ఇక్కడ చదువుతో పాటు ఆటలు, పాటలకు ప్రాధాన్యం కల్పిస్తారు. రాష్ట్రంలో ఏ నవోదయలో లేనివిధంగా వర్గల్‌ విద్యాలయంలో 400 మీటర్ల ట్రాక్‌తో కూడిన స్టేడియం, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో కోర్టులు, జిమ్‌ను ఏర్పాటు చేశారు. ఇద్దరు వ్యాయామ ఉపాధ్యాయులు ఆటల్లో తర్ఫీదునిచ్చేందుకు నియమితులయ్యారు. మ్యూజిక్‌ టీచర్‌, డ్రాయింగ్‌ టీచర్‌ ఉన్నారు. అత్యవసర వైద్య సేవలకుగాను స్టాఫ్‌నర్స్‌, హెల్త్‌సెంటర్‌ ఉన్నాయి. 

విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి జవహర్‌ నవోదయ విద్యాలయాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. నవోదయలో నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన, విశాలమైన క్రీడా మైదానం, స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌, కంప్యూటర్‌ విద్యతో పాటు అన్ని వసతులు ఉన్నాయి. విద్యార్థి ఆసక్తి కనబరిచే క్రీడా, సాంస్కృతిక విభాగం, చిత్రలేఖనంతో పాటు తదితర విషయాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. నాలుగేళ్లుగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టాం. పూర్తి వివరాలకు నవోదయ విద్యాలయం 7893509094, 9951938677, 9440926144 ఫోన్‌ నంబర్లను సంప్రదించండి

- వెంకటరమణ, వర్గల్‌ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌

Updated Date - 2021-11-29T05:07:28+05:30 IST