సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-10-30T04:25:30+05:30 IST

ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని చిత్తశుద్ధితో పని చేయాలని ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలి

   మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌


చేర్యాల, అక్టోబరు 29: ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని చిత్తశుద్ధితో పని చేయాలని ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ అన్నారు. చేర్యాల మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో గుర్తించిన విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడం లేదని, వచ్చే మండల సభలోగా పరిష్కరించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. వ్యవసాయబావుల వద్ద ఇనుప విద్యుత్‌ స్తంభాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. పారిశుధ్య కార్మికుల సేవలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం వేళ వినియోగించుకుంటుండడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకువచ్చారు. కాగా ఈ సీజన్‌కు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో 12 ధాన్యం కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు బాబురావు తెలిపారు. మిషన్‌ భగీరథకు సంబంధించి చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పోతిరెడ్డిపల్లి సర్పంచ్‌ కత్తుల కృష్ణవేణి అన్నారు. అనంతరం ఎంపీపీ కరుణాకర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అంకితభావంతో పాటుపడాలని సూచించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మండలంలోని 11మందికి మంజూరైన పూర్తి సబ్సిడీ చెక్కులను అందజేశారు. సమావేశంలో జడ్పీటీసీ శెట్టె మల్లేశం, ఎంపీడీవో తారీక్‌ అన్వర్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-30T04:25:30+05:30 IST