హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-12-09T04:37:49+05:30 IST

రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా 6వ అదనపు జడ్జి నీలిమ పేర్కొన్నారు.

హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

  లోక్‌ అదాలత్‌లో సమస్యలను  పరిష్కరించుకోవాలి

 జిల్లా 6 వ అదనపు జడ్జి నీలిమ


ములుగు, డిసెంబరు 8: రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా 6వ అదనపు జడ్జి నీలిమ పేర్కొన్నారు. ఈ నెల 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం ములుగు మండల పరిధిలోని వంటిమామిడి మార్కెట్‌ యార్డులో మండల న్యాయ సేవా సమితి గజ్వేల్‌ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని హక్కులు, చట్టాల వినియోగంపై ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతుండడంతో కొందరు వ్యాపారులు అమాయకులైన రైతులను ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల చదువు కోసం తల్లితండ్రులు, కుటుంబసభ్యులు పూర్తి బాధ్యత తీసుకొని అన్ని రంగాల్లో రాణించేలా మంచి భవిష్యత్తును అందజేయాలని కోరారు. బాల్య వివాహాలను అరికట్టాలని, వరకట్నపు వేధింపుల్లో చిక్కుకోకుండా చూడాలని పేర్కొన్నారు. బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సిద్ధంగా ఉన్నదని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంవత్సర ఆదాయం రూ.మూడు లక్షల వరకు కలిగి ఉన్నవారికి న్యాయవ్యవస్థ ఉచిత న్యాయ సహాయాన్ని అందజేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సంతోష్‌కుమార్‌, గజ్వేల్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకట మల్లిక్‌ సుబ్రహ్మణ్యశర్మ, ములుగు తహసీల్దార్‌ రఘువీరారెడ్డి, ఎస్‌ఐ రంగ కృష్ణ, మార్కెట్‌ కమిటీ సెక్రెటరీ రేవంత్‌, చిన్న తిమ్మాపూర్‌ సర్పంచ్‌ హంసా మహేష్‌యాదవ్‌, నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-12-09T04:37:49+05:30 IST