నామినేషన్ల హడావిడి

ABN , First Publish Date - 2021-11-23T05:16:40+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా ఆదివారం వరకు ఒకటే నామినేషన్‌ దాఖలైంది. ఇంకా ఒక రోజు మాత్రమే గడువు ఉండడం, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో నామినేషన్ల హడావిడి మొదలైంది. సోమవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థితో పాటు మరో ముగ్గురు స్వతంత్రులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ రెండు సెట్లను దాఖలు చేశారు. దీంతో మొత్తంగా ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో నామినేషన్ల స్వీకరణ ముగియనున్నది.

నామినేషన్ల హడావిడి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొదలైన హంగామా

ఇప్పటివరకు ఆరు నామినేషన్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా యాదవరెడ్డి 

స్వతంత్ర అభ్యర్థులుగా చిన్నశంకరంపేట వైస్‌ ఎంపీపీ, సంగారెడ్డి కౌన్సిలర్‌, గజ్వేల్‌ నియోజకవర్గ నేత 

నేడు నామినేషన్ల సమర్పణకు చివరి రోజు


ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా ఆదివారం వరకు ఒకటే నామినేషన్‌ దాఖలైంది. ఇంకా ఒక రోజు మాత్రమే గడువు ఉండడం, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో నామినేషన్ల హడావిడి మొదలైంది. సోమవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థితో పాటు మరో ముగ్గురు స్వతంత్రులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ రెండు సెట్లను దాఖలు చేశారు. దీంతో మొత్తంగా ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో నామినేషన్ల స్వీకరణ ముగియనున్నది.


మెదక్‌ రూరల్‌, నవంబరు 22 : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన వంటేరు యాదవరెడ్డి మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌తో కలిసి సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌కు వచ్చారు. నామేనేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌కు అందజేశారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బోయిని విజయలక్ష్మి, మెదక్‌ నియోజకవర్గానికి చెందిన ఐరేని సత్యనారాయణగౌడ్‌, గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన చింతల సాయిబాబా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్‌ వేయగా మంగళవారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి మరో సెట్‌ నామినేషన్‌ వేయనున్నట్లు తెలిసింది. నేటితో నామినేషన్ల స్వీకరణ ముగియనున్నది. గుర్తింపు పొందిన పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ మాత్రమే తమ అభ్యర్థిని ప్రకటించి నామినేషన్‌ వేయించింది. బీజేపీ, కాంగ్రె్‌సతో పాటు ఇతర పార్టీల నుంచి ఇంకా ఎలాంటి నామినేషన్లు రాలేదు. 


సేవలను గుర్తించి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ : యాదవరెడ్డి

సేవలను గుర్తించి సీఎం కేసీఆర్‌ తనకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి పేర్కొన్నారు. నామినేషన్‌ పత్రాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ను పోటీ చేయాలని తామంతా కోరామని, అలాగే పోటీ చేసి గెలిచి తమ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్నే అభివృద్ధి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీగా కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనవంతు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనకు పోటీ చేసేందుకు పార్టీ నుంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ యాదవరెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ కోసం కృషి చేసినందుకు సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలిపారు. గజ్వేల్‌కు చెందిన యాదవరెడ్డి వైద్యుడిగానూ సేవలు అందిస్తున్నారన్నారు. సోమవారం నామినల్‌గా నామినేషన్‌ సెట్‌ దాఖలు చేశామని, మంగళవారం మరోసెట్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. 


సంగారెడ్డి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ నామినేషన్‌ 

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 22 : మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి సంగారెడ్డి మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ బోయిని విజయలక్ష్మీచంద్రశేఖర్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. సంగారెడ్డి నుంచి పలువురు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి మెదక్‌కు తరలివెళ్లిన విజయలక్ష్మి దపంతులు మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి విజయం సాధించిన బోయిని విజయలక్ష్మి కొన్నాళ్లకే టీఆర్‌ఎ్‌సలో చేరారు. అయితే టీఆర్‌ఎ్‌సలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆమె ఎమ్మెల్సీ పదవికి స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడంతో సంగారెడ్డి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 


మాకు మేమే ఓటు వేసుకుంటాం : స్వతంత్ర అభ్యర్థి సత్యనారాయణగౌడ్‌

చిన్నశంకరంపేట, నవంబరు 22 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు అందరం కలిసి తమకు తామే ఓటు వేసుకుంటామని స్వతంత్ర అభ్యర్థి, చిన్నశంకరంపేట వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌ తెలియజేశారు. సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌లో 23 మంది ఎంపీటీసీలతో కలిసి ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను సీఎం కేసీఆర్‌ చిన్నచూపు చూస్తూ అభివృద్ధికి సహకరించడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిరాశతో ఉన్నారన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించేందుకు పరిషత్‌ సభ్యుల మద్దతు కోరుతున్నామన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్ల మద్దతును కూడగట్టి ఎమ్మెల్సీగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షడు శివకుమార్‌, ఎంపీటీసీ ప్రసాద్‌గౌడ్‌, శ్రీహరి, రామాయంపేట, వెల్దుర్తి, పాపన్నపేట, నర్సాపూర్‌ మండలాల ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.


భూపాల్‌, ఫరీద్‌కు నిరాశే

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి : శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తమకు మరోసారి అవకాశం ఇస్తుందని భావించిన సీనియర్లు, శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, మాజీమంత్రి ఎండీ ఫరీదుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. దీంతో ఆయన నేతల అనుచరులు తమ భవితవ్యం ఏంటనే ఆందోళనలో ఉన్నారు.

కొన్నాళ్లుగా సంగారెడ్డి జిల్లాకు చెందిన శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్‌ శాసనమండలిలో సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికైన మాజీమంత్రి ఎండీ ఫరీదుద్దీన్‌ పదవీకాలం జూన్‌ 3తో ముగిసింది. శాసనమండలి సభ్యత్వం కోల్పోయిన ఆరుగురిలో మైనార్టీ నుంచి ఎండీ ఫరీదుద్దీన్‌ ఉన్నారు. మైనార్టీ కోటాలో తనకు మళ్లీ అవకాశం వస్తుందని భావించారు. ఇక శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డిదీ అదే పరిస్థితి. 2007 నుంచి ఆయన స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 4తో ముగుస్తున్నది. కేసీఆర్‌ టికెట్‌ ఇస్తే స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆశతో భూపాల్‌రెడ్డి ఉండగా పార్టీ అధినేత మాత్రం గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకుడు డాక్టర్‌ యాదవరెడ్డికి టికెట్‌ ఖరారు చేశారు. తాజాగా శాసనమండలి ఎన్నికల్లో వీరిద్దరికీ పార్టీ అభ్యర్థిత్వం ఇవ్వకపోడంతో సంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యమే లేకుండాపోయింది. అలాగే రెండేళ్లలో శాసనసభ ఎన్నికలు ఉన్నందునే మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థిత్వం గురించి ఆలోచించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో చింతాకు చేనేత, జౌళి సహకార సంస్థ చైర్మన్‌గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపించినా అవి  అమలుకు నోచుకోలేదు. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని గతంలో కేసీఆర్‌ హామీ ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పరిశీలించలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గ టికెట్‌ ఆయనకే ఇవ్వాల్సి వస్తుందనే భావనతో ఈసారి ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ ఛాన్స్‌ రాలేదని సమాచారం.


ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి?

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి : మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలాజగ్గారెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు ఆమె కాంగ్రెస్‌ ముఖ్యనేతలు దామోదరరాజనర్సింహ, గీతారెడ్డి, సురేశ్‌షెట్కార్‌ తదితరులను కలిసి విన్నవించారు. ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలమైన లీడర్‌, క్యాడర్‌ను కలిగి ఉన్నదని భావిస్తున్న నాయకత్వం ఆమె పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఫలితంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కాపాడినట్టవడమే కాకుండా క్యాడర్‌లో ఉత్సాహం కలిగించినట్టవుతుందని ఆయా నాయకులతో నిర్మలాజగ్గారెడ్డి అభిప్రాయపడ్డట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-11-23T05:16:40+05:30 IST