ఉద్యమ సమయంలో సీఎంలనే గడగడలాడించా
ABN , First Publish Date - 2021-08-25T05:56:54+05:30 IST
బానిస బతుకుల నుంచి విముక్తి కోసం పోరాడిన సర్ధార్ సర్వాయి పాపన్న ఆశయస్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ సమయంలో తాను హైదరాబాద్‌లో మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నప్పటికీ చిత్తశుద్ధితో పోరాడానని, అప్పటి ముఖ్యమంత్రులను గడగడలాడించానని తెలంగాణ ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు.

జనగామకు సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణానికి కృషి చేస్తా
మంత్రి శ్రీనివా్‌సగౌడ్
చేర్యాల, ఆగస్టు 24 : బానిస బతుకుల నుంచి విముక్తి కోసం పోరాడిన సర్ధార్ సర్వాయి పాపన్న ఆశయస్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ సమయంలో తాను హైదరాబాద్‌లో మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నప్పటికీ చిత్తశుద్ధితో పోరాడానని, అప్పటి ముఖ్యమంత్రులను గడగడలాడించానని తెలంగాణ ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. జాతీయ గౌడ జనహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రసూలాబాద్, ఐనాపూర్, గౌరాయపల్లి, కొమురవెల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం కొమురవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. బహుజనుల సంక్షేమం కోసం పాటుపడ్డ మహోన్నతుడు పాపన్న అని కొనియాడారు. ఆయన పోరాట పటిమను ఇనుమడింపజేసేలా చారిత్రక నేపథ్యం కలిగిన జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చొరవతో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. సహజసిద్ధంగా తయారయ్యే అమృతంలాంటి కల్లును గత ప్రభుత్వాలు చిన్నచూపుతో ప్రజలకు దూరం చేశాయన్నారు. రంగునీళ్ల మద్యానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రస్తుత తరుణంలో చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన కల్లుకు బహిరంగ అమ్మకాలు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో రూ.9 కోట్లు, నందనంలో రూ.6 కోట్ల వ్యయంతో నీర తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గౌడ కులస్తులకు హైదరాబాద్‌లో రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించి రూ.50 కోట్లతో గౌడ ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బహుజన నాయకుల పట్ల విమర్శలు చేస్తున్న కుక్కలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని కోరారు. అనంతరం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని పూజలు నిర్వహించారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, సీఎం కేసీఆర్ చొరవతో ఉపాధి లభించిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, జడ్పీటీసీ సిలివేరి సిద్ధప్ప, ఎంపీపీ తలారి కీర్తన, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, మార్కెట్ చైర్మన్ సుంకరి మల్లేశం, గౌడజన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్, జైహింద్ గౌడ్, సర్పంచులు పచ్చిమడ్ల స్వామి, చెరుకు రమణారెడ్డి, సద్ది కృష్ణారెడ్డి, సార్ల లత, ఎంపీటీసీ కొయ్యడ రాజమణి తదితరులు పాల్గొన్నారు.