పొయ్యి వెలగదు.. బువ్వ పెట్టరు..!

ABN , First Publish Date - 2021-12-08T05:18:05+05:30 IST

భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రేట్లు పెంచకపోడంతో మధ్యాహ్న భోజనం చాలా స్కూళ్లలో నిలిచిపోయింది. ప్రభుత్వం చెల్లిస్తున్న రేట్లకు వంట వండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించడం లేదు.

పొయ్యి వెలగదు.. బువ్వ పెట్టరు..!
కొల్చారం మండలం రంగంపేటలో ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తింటున్న విద్యార్థులు

కష్టాల్లో మధ్యాహ్న భోజనం

ఆకాశంలో నిత్యావసరాల ధరలు

గిట్టుబాటు కాని ప్రభుత్వ చెల్లింపులు

మూడు నెలలుగా బిల్లులు అందక అవస్థలు

వండి పెట్టలేమంటున్న నిర్వాహకులు

40 శాతం బడుల్లో భోజనం బంద్‌

ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌/కొండపాక/సిద్దిపేటఅర్బన్‌, డిసెంబరు 7: భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రేట్లు పెంచకపోడంతో మధ్యాహ్న భోజనం చాలా స్కూళ్లలో నిలిచిపోయింది. ప్రభుత్వం చెల్లిస్తున్న రేట్లకు వంట వండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించడం లేదు. 


మార్కెట్‌ రేటుకు వ్యత్యాసం

ప్రతీనెల మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యాన్ని ప్రభుత్వం అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తుంది. ఒక్కో తరగతి విద్యార్థికి ఒక్కో రకంగా బిల్లులు చెల్లిస్తున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒకొక్కరికి రూ. 4. 97, ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్కరికి రూ. 7. 45 చెల్లిస్తున్నది. వారానికి మూడు రోజులు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్లు ఇవ్వాలని ప్రభుత్వం మెనూలో పేర్కొన్నది. ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.4 చెల్లిస్తుండగా మార్కెట్‌లో గుడ్డు రూ.5కు పైగా ధర ఉన్నది. మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు ప్రభుత్వం చెల్లించే బిల్లులు సరిపోవడం లేదు.


గౌరవ వేతనం అంతంతే!

మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా నియమిస్తున్నది. 50 మంది విద్యార్థులు ఉన్నచోట ఒకరు, 100 మంది విద్యార్థులుంటే ఇద్దరు, 100కు పైగా విద్యార్థులుంటే ముగ్గురు కుక్‌ కం హెల్పర్లు పనిచేస్తున్నారు. వీరికి రూ. వెయ్యి గౌరవ వేతనం అందజేస్తున్నది. 15 సంవత్సరాలుగా వీరికి గౌరవ వేతనం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో ఏడాదిన్నర వారికి గౌరవ వేతనం నిలిపివేశారు. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలైనా ఇప్పటికీ బిల్లులు, గౌరవ వేతనం చెల్లించలేదు. దీంతో మార్కెట్‌ రేట్ల ప్రకారం బిల్లులు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులు, గౌరవ వేతనం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నెల రోజులుగా మధ్యాహ్న భోజనం వండడమే మానేశారు.


గిట్టుబాటు కాని వంట

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ఇస్తున్న రేటుకు వంట చేయడం గిట్టుబాటు కావడం లేదు. దీంతో మధ్యాహ్న భోజనం వండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 2021–22 విద్యా సంవత్సరంలో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు మధ్యాహ్న భోజన బిల్లులు అందలేదు. దాంతో మూడు నెలల నుంచి పెట్టుబడి పెట్టి నిర్వహిస్తున్నప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. బిల్లులు చెల్లించడం లేదని డిసెంబరు నెలలో మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేయడం మానేశారు. దీంతో పలు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నిలిచిపోగా కొన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులే వంట చేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థానిక మహిళల సహకారంతో వంట చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండించడానికి అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో తమ జేబుల నుంచి చెల్లిస్తున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు.


మెదక్‌ జిల్లాలో 905 స్కూళ్లు, 72 వేల మంది విద్యార్థులు

కరోనా కారణంగా జిల్లాలో చాలాచోట్ల ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి. ప్రైవే టులో చదివిస్తే బడి నడిచినా, నడవకున్నా వేల రూపాయల ఫీజులు మాత్రం కట్టక తప్పడం లేదు. కరోనా కారణంగా స్కూళ్లు మధ్యలోనే మూతపడటంతో  చెల్లించలేక తల్లిదండ్రులు సర్కారు బడుల వైపు మొగ్గుచూపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మెదక్‌ జిల్లాలో మొత్తం 905 స్కూళ్లలో ప్రస్తుతం 72 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం వండటానికి 1,797 మంది కార్మికులను ఏర్పాటు చేశారు. జిల్లాలో 63 పాఠశాలల్లో అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. మిగిలిన స్కూళ్లలో కార్మికులే వండుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన బిల్లులు రూ.2.61 కోట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదని కార్మికులు వాపోతున్నారు. అధికారులు మాత్రం రెండు నెలలకు సంబంధించిన బిల్లులతో పాటు అదనంగా నిధులు మంజూరైనట్టు చెబుతున్నారు.


అన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండాల్సిందే : రమేష్‌కుమార్‌, డీఈవో, మెదక్‌ జిల్లా

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా ప్రతీ రోజు మధ్యాహ్న భోజనాన్ని వండాల్సిందేనని ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోకపోతే స్కూల్‌ గ్రాంటు నిధులను వాడుకోవాలని చెప్పాం. అందుబాటులో ఉన్నవారితో వంట చేయించాలని సూచించాం. మధ్యాహ్న భోజనానికి సంబంధించి రూ. 3.12 కోట్ల బిల్లులు చెల్లించాం. గతానికి భిన్నంగా ఈసారి ముందుగానే కొంత డబ్బును కూడా చెల్లించాం. 


కూలీ కూడా గిట్టుబాటు లేదు

అనిత, మధ్యాహ్న భోజన కార్మికురాలు, కలాన్‌శెట్టిపల్లి, వెల్దుర్తి మండలం

మధ్యాహ్న భోజనం వంట చేస్తే కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. నిత్యావసరాలు, కూరగాయలు, గ్యాస్‌.. ఇలా ప్రతీ వస్తువు ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే పైసలు ఏమాత్రం సరిపోవడం లేదు. చేతి నుంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇంత కష్టపడినా మూడు నెలలుగా బిల్లులు రాలేదు.

Updated Date - 2021-12-08T05:18:05+05:30 IST