ఉరుకులు.. పరుగులు

ABN , First Publish Date - 2021-10-26T05:07:58+05:30 IST

ఒక్కనిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థులను పరుగులు పెట్టించింది.

ఉరుకులు.. పరుగులు
సంగారెడ్డిలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

‘ఒక్క నిమిషం’ నిబంధనతో విద్యార్థుల హైరానా 

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు

మొదటి రోజు మెదక్‌ జిల్లాలో 857 మంది,

సంగారెడ్డి జిల్లాలో 1135 మంది విద్యార్థులు గైర్హాజరు


మెదక్‌అర్బన్‌ /సంగారెడ్డిఅర్బన్‌ అక్టోబరు25: ఒక్కనిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థులను పరుగులు పెట్టించింది. దీంతో గంట ముందుగానే విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సోమవారం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ కారణంగా గతేడాది ఇంటర్‌ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. మొత్తంగా 7,211 మంది విద్యార్థులకు గాను..6,354 మంది(88.12 శాతం) హాజరయ్యారు. 857 మంది గైర్హాజరయ్యారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఇంటర్‌ నోడల్‌ అధికారి సత్యనారాయణ పర్యవేక్షించారు. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 54 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు విద్యార్ధులు తెలుగు, హిందీ, ఉర్థూ, సంస్కృతం పరీక్షలు రాశారు. రెగ్యులర్‌, ఒకేషనల్‌ కలిపి 16,265 మంది విద్యార్థులకు 15,130 మంది హాజరయ్యారు. 1135 మంది గైర్హాజరయ్యారు. సంగారెడ్డిలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి గోవిందరామ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలో మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ముగిశాయని, ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని డీఐఈవో ఆర్‌.గోవిందరామ్‌ తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపింది. కొన్ని చోట్ల బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్ధులు ఆటోలను ఆశ్రయించారు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌, హ్యాండ్‌ శానిటైజేషన్‌ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 
సిద్దిపేట జిల్లాలో తొలి రోజు ప్రశాంతం


సిద్దిపేట క్రైం, అక్టోబరు 25 : ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాల్లో 12,239 మంది విద్యార్థులకుగాను 11,113 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1126 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు ముందు తెలియజేయడంతో నిర్ణీత సమయానికి గంట ముందు నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది. మాస్కు ధరించిన విద్యార్థులను మాత్రమే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. ప్రతీ విద్యార్థిని థర్మల్‌ స్కానర్‌ ద్వారా టెంపరేచర్‌ను పరీక్షించాక కేంద్రాల్లోకి పంపించారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఒకే దగ్గర గుమిగూడాకుండా చర్యలు తీసుకున్నారు.


చాలా సంతోషంగా ఉంది

కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందో లేదో అనుకున్నాం. రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పైతరగతులకు ప్రమోట్‌ చేసింది. కాని ఈసారి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు మొదలు కావడంతో చాల సంతోషంగా ఉంది.

- గీత, ఎన్సాన్‌పల్లి గురుకుల పాఠశాల విద్యార్థి


ధైర్యంగా పరీక్షలు రాసుకోవచ్చు 

అందరితో కలిసి పరీక్ష రాయడం వల్ల కరోనా వైరస్‌ సోకుతుందని చాలా భయం వేసింది. కానీ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించారు. మాస్కులు ధరించిన వారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతిచ్చారు. శానిటైజర్‌ అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరినీ స్ర్కీనింగ్‌ చేసి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాసుకోవచ్చు అనే నమ్మకం కలిగింది.

- అమూల్య, సిద్దిపేట


పరీక్షలు ఉంటాయో ఉండవో అనుకున్నా

ఇంటర్మీడియట్లో సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగును ఎంచుకున్నాను. సోమవారం రోజు తెలుగు పరీక్ష చాలా ఈజీగా అనిపించింది. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఉంటాయో ఉండవో అనుకున్నాను. కానీ కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పరీక్షలను నిర్వహించారు. మిగతా పరీక్షలు కూడా బాగా రాస్తాను.

- నాగరాజు, మాస్టర్‌ మైండ్స్‌ జూ. కళాశాల, సిద్దిపేటUpdated Date - 2021-10-26T05:07:58+05:30 IST