మొక్కుబడిగా మెదక్‌ జడ్పీ సమావేశం

ABN , First Publish Date - 2021-03-22T05:44:11+05:30 IST

మెదక్‌ జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం ఈసారి కూడా మొక్కుబడిగానే సాగింది. చర్చను ఆరు అంశాలకే పరిమితం చేశారు.

మొక్కుబడిగా మెదక్‌ జడ్పీ సమావేశం
జడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ హేమలత

కరెంటు అధికారులపై మెదక్‌ ఎమ్మెల్యే ఆగ్రహం


మెదక్‌ రూరల్‌, మార్చి 21: మెదక్‌ జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం ఈసారి కూడా మొక్కుబడిగానే సాగింది. చర్చను ఆరు అంశాలకే పరిమితం చేశారు. మిషన్‌ భగీరథ, వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్‌, అటవీ శాఖలో సమస్యలపైనే చర్చ జరిగింది. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌  అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. కలెక్టర్‌ హరీశ్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభా్‌షరెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. రామాయంపేట, శంకరంపేట, రేగోడ్‌, శివ్వంపేట మండలాల్లోని కొన్ని గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు రావడంలేదని జడ్పీటీసీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ వేసవి సమీపిస్తున్నందున పనలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీటిని వృథా చేయకుండా, నియంత్రణ వాల్వులు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  మండలాల వారిగా  సమీక్షించి ఆఆ గ్రామాలను సందర్శించి మంచినీటి ఇబ్బంది తలెత్తకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక లీటర్‌ నీటికి సుమారరుఉ  20 నుంచి 30 పైసల్‌ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, కాబట్టి గ్రామాల్లో నీటి కులాయికి సంబంధించి నియంత్రణ వాల్వులు తొలగించకుండా, వృదా పోకుండా పొదుపుగా వాడే విధంగా చూడాలన్నారు. అన్ని మండలాల్లో కరోనా టీకా అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజా ప్రతినిధులు కోరగా.. జిల్లాలో 18 వేల టీకాలు అందుబాటులో ఉన్నాయని, అర్హులందరికీ టీకా ఇస్తామని డీఎంహెచ్‌వో తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హెచ్చరించారు. అర్హులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖపై చర్చ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేసేలా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 7,500 మంది  పదో తరగతి విద్యార్థులుండగా వారందరికీ మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించామని డీఈవో రమేశ్‌కుమార్‌ తెలిపారు. ధర్మల్‌ స్ర్కీనింగ్‌తో అన్ని కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు. 

ట్రాన్స్‌కో అధికారుల తీరుపై మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టేక్మాల్‌ మండలంలో విద్యుత్‌ సమస్యపై గత రెండు సమావేశాల్లో చెప్పినా ఇప్పటి వరకు   పరిష్కరించ లేదని ఆగ్రజమం వ్యక్తం చేశారు. అన్ని తండాల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు  చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీవో, ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకోవలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి స్పీడ్‌  బ్రేకర్లు, సూచిక బోర్డులు, రేడియం స్టీక్కర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కోతులు జనావాసాల్లోకి, రోడ్లపైకి రాకుండా అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలను పెంచాలని ఎమ్మెల్సీ సుబా్‌షరెడ్డి సూచించారు. జడ్పీ సీఈవో శైలేష్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:44:11+05:30 IST