వాడవాడలా ఘనంగా మే డే

ABN , First Publish Date - 2021-05-02T06:01:12+05:30 IST

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో శనివారం ఘనంగా మేడేను నిర్వహించారు.

వాడవాడలా ఘనంగా మే డే
మే డే సందర్భంగా సిద్దిపేటలో జెండాను ఆవిష్కరిస్తున్న ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని  వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో శనివారం ఘనంగా మేడేను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ  1886 సంవత్సరం మే 1న చికాగో నగరంలో కార్మికులు నిర్వహించిన ప్రదర్శనలో అనేక మంది మరణించారన్నారు. వారి త్యాగ ఫలితంగానే పని గంటల విధానం అమలయ్యిందన్నారు. అమరులను స్మరించుకుంటూ మే 1న మే  డేను నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.

సిద్దిపేట అర్బన్‌/చిన్నకోడూరు/నారాయణరావుపేట/నంగునూరు, మే 1 : కార్మిక వర్గాల పక్షాన నిలబడి పోరాటం చేసేది ఎర్రజెండా మాత్రమేనని వామపక్ష పార్టీల నాయకులు నక్కల యాదవరెడ్డి, మంద పవన్‌, ఏఐటీయూసీ నాయకుడు మచ్చ శ్రీనివాస్‌, సీఐటీయూ నాయకుడు గోపాలస్వామి అన్నారు. మే డేను పురస్కరించుకొని శనివారం సిద్దిపేటలోని ఆయా పార్టీల కార్యాలయాల ఎదుట ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ప్రజల కష్టాలకు పెట్టుబడిదారి, కార్పొరేట్‌ విధానాలే కారణమని, ఈ విధానాలను రూపుమాపి ప్రజలను కష్టాల నుంచి విముక్తి చేసేది ఎర్రజెండా, కమ్యూనిజం మాత్రమేనన్నా రు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, ప్రజలు తమ హక్కుల కోసం ఉద్యమించారన్నారు. ఫలితంగా ఎనిమిది గంటల పని దినం అమలుతో పాటు కార్మిక వర్గానికి, ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయని, చట్ట రూపంలో కనీస వేతనాలు అమల్లోకి వచ్చాయన్నారు. చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో కార్మిక సంఘాల నాయకులు జెండాను ఆవిష్కరించారు. నారాయణరావుపేట మండలంలోని ఆయా గ్రామాల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి తునికి మహేష్‌ ఆధ్వర్యంలో మే డేను ఘనంగా నిర్వహించారు. నంగునూరు లో సీఐటీయూ మండల శాఖ అధ్యక్షుడు అనరాజు ఎల్లయ్య, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు మేడేను నిర్వహించారు.

చేర్యాల/దుబ్బాక/మిరుదొడ్డి: చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎ్‌సకేవీ, భవన నిర్మాణ కార్మిక సంఘం, హమాలీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. అలాగే పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి తెలంగాణ మాలమహానాడు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. దుబ్బాకలో సీఐటీయూ జెండాను ఆపార్టీ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ ఆధ్వర్యంలో ఎగురవేశారు. మిరుదొడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఎగురవేశారు.

సమానపనికి సమాన వేతనం చెల్లించాలి 

బెజ్జంకి/కోహెడ/హుస్నాబాద్‌/మద్దూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ  కార్మిక చట్టాలను కాల రాసేందుకు కుట్ర పన్నుతున్నాయని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సీపీఎం మండల కార్యదర్శి శ్రీనివాస్‌, సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి రూపేష్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగురవేసి కార్మిక దినోత్సవ  వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్మికులకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాం డ్‌ చేశారు. కోహెడ మండలకేంద్రంలో, గ్రామాల్లో సీపీఐ, హమాలీ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డేను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాలను ఆవిష్కరించారు.  తీగలకుంటపల్లిలో మేడే సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు. హుస్నాబాద్‌లోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో మే డే సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్‌ జెండాను ఆవిష్కరించారు. ప్రైవేట్‌ బస్సు డ్రైవర్ల అసోయేషన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో కార్మికులు మే డేను ఘనంగా నిర్వహించారు.  మద్దూరులో సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి జెండాను ఆవిష్కరించారు. రెడ్యానాయక్‌ తండాలో కార్మిక సంఘం అధ్యక్షుడు హరిలాల్‌ జెండావిష్కరణ చేశారు. 

ఐక్యంగా నిలబడి హక్కులు సాధించుకోవాలి

జగదేవ్‌పూర్‌/ములుగు/కొండపాక/గజ్వేల్‌: జగదేవ్‌పూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ, విద్యుత్‌ హమాలీ సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా నిలబడి హక్కు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ములుగులో కార్మికుల సంఘం అధ్యక్షుడు తోడేటి వెంకటేశం ఆధ్వర్యంలో కార్మికులు జెండాను ఆవిష్కరించారు. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కొండపాక మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జెండా ఎగురవేశారు. కొండపాకలో సర్పంచ్‌ చిట్టి మాధురి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సత్కరించారు. గజ్వేల్‌ మండలంలోని మున్సిపల్‌ కార్యాలయం  ఎదుట, రాణే పరిశ్రమ, లక్ష్మీ బాలాజీ సిరామిక్స్‌, గజ్వేల్‌ లారీ ట్రాన్స్‌పోర్టు యూనియన్‌, ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌, సీఐటీయూ కార్యాలయం ఎదుట, ఇందిరా పార్కు చౌరస్తా, గ్రామాల్లోని గ్రామపంచాయతీ, యునైటెడ్‌ ఎలక్ట్రీసిటీ యూనియన్‌, హమాలీ యూనియన్‌ ఆధ్వర్యంలో సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. 

Updated Date - 2021-05-02T06:01:12+05:30 IST