మంబోజిపల్లిలో దారుణహత్య

ABN , First Publish Date - 2021-08-11T05:09:51+05:30 IST

నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద నిద్రిస్తున్న వ్యక్తి తెల్లారేసరికి దారుణహత్యకు గురయ్యాడు.

మంబోజిపల్లిలో దారుణహత్య
హత్యకు గురైన బోల సిద్దయ్య

ఆస్తి పంపకాలే కారణమంటున్న స్థానికులు 

కుటుంబీకులపై అనుమానం

మెదక్‌ రూరల్‌, ఆగస్టు 10: నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద నిద్రిస్తున్న వ్యక్తి తెల్లారేసరికి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన మెదక్‌ మండలం మంబోజిపల్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మంబోజిపల్లి గ్రామానికి చెందిన బోల సిద్దయ్య(66)కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఎప్పటిలాగే భోజనం చేసిన సిద్దయ్య నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో నిద్రించాడు. ఉదయం చూసేసరికి రక్తపుమడుగులో విగతజీవిగా పడిఉన్నాడు. కత్తులతో దాడి  చేసి కొట్టడంతో ముఖంపై తీవ్రగాయాలై మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వివాదరహితుడైన సిద్దయ్యను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. అయితే గతంలో భూమి విషయంలో కుటుంబంలో ఘర్షణలు జరిగాయి. ఆస్తి విషయంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మెదక్‌ సీఐ పాలవెల్లి, రూరల్‌ ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు. గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు ఇతర వ్యక్తులను విచారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2021-08-11T05:09:51+05:30 IST