కమనీయం

ABN , First Publish Date - 2021-12-27T05:02:17+05:30 IST

కోరమీసాల కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం కమనీయంగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతాల సాక్షిగా, వీరశైవపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల చప్పుళ్లు మధ్య కేతలమ్మ, మేడలాదేవిని మల్లన్న వివాహమాడాడు.

కమనీయం
తోటబావి ప్రాంగణంలోని వేదికపై కల్యాణం నిర్వహిస్తున్న వీరశైవార్చకులు

అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

హాజరైన మంత్రులు తలసాని, మల్లారెడ్డి,  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఇతర ప్రముఖులు

మార్మోగిన మల్లన్న నామస్మరణ


చేర్యాల, డిసెంబరు 26 : కోరమీసాల కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం కమనీయంగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతాల సాక్షిగా, వీరశైవపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల చప్పుళ్లు మధ్య కేతలమ్మ, మేడలాదేవిని మల్లన్న వివాహమాడాడు. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై ఈవో బాలాజీశర్మ ఆధ్వర్వంలో, కాశీ జ్ఞానసింహాసన మహాపీఠశాఖ వీరశైవ పీఠాధిపతి మణికంఠ శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వీరశైవాగమశాస్త్రం ప్రకారం కల్యాణం నిర్వహించారు. ముందుగా తెల్లవారుజామున 4.30 గంటలకు గర్భాలయ మండపంలోని వీరభద్రుడికి బలిహరణ చేసి దృష్టికుంభాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి తొలిదర్శనాన్ని ప్రారంభించారు. 


కన్నుల పండుగగా కల్యాణం

దేవదేవుల ఆహ్వాన పూజానంతరం అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గర్భాలయంలో నుంచి సంప్రదాయబద్ధంగా పల్లకీలో ఊరేగిస్తూ మహిళల కోలోటాల నడుమ భాజాభజంత్రీల మధ్య కల్యాణమంటపానికి తీసుకువచ్చారు. వరుడు మల్లికార్జునస్వామి తరఫున కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి మల్లికార్జున్‌ -మాధవి దంపతులు, అమ్మవార్లు గొల్లకేతమ్మ, మేడలాదేవి తరఫున కన్యాదాతలుగా మహదేవుని చిన్నమల్లికార్జున్‌-సుజాత దంపతులు వ్యవహరించారు. ఆనవాయితీ ప్రకారం గ్రామపంచాయతీ తరఫున సర్పంచు సార్ల లత-కిష్టయ్య దంపతులు, ఒగ్గుపూజారులు పట్టువస్ర్తాలు, పుస్తెమట్టెలు, తలంబ్రాలు అందజేశారు. గర్భాలయంలోనూ మల్లన్నకు శాస్ర్తోక్తయుక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. కన్యాదాతలుగా మహదేవుని మనోహర్‌-మమత దంపతులు, కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశస్తులైన పడిగన్నగారి మల్లయ్య-బాలమణి దంపతులు వ్యవహరించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తల్రంబాలను అందచేశారు. మల్లన్నకిజై అంటూ భక్తులు చేసిన జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. అనంతరం ముత్యాల తలంబ్రాలు, ఓడిబియ్యం పోశారు. పట్టువస్ర్తాలతో ధగధగలాడుతున్న దేవతామూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణాన్ని తిలకించిన భక్తులు మల్లన్న నామస్మరణతో పులకించిపోయారు. 


హాజరైన ప్రముఖులు 

కల్యాణానికి మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరె డ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, టీఎ్‌సఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోల్లశ్రీనివాస్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, జడ్పీటీసీలు సిద్దప్ప, శెట్టి మల్లేశం, గిరికొండల్‌రెడ్డి, ఎంపీపీ తలారి కీర్తన, బద్దిపడిగ కృష్ణారెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ గుజ్జె సంపత్‌రెడ్డి, ధర్మకర్తలతో పాటు జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అఽధికారులు హాజరయ్యారు. హుస్నాబాద్‌ ఏసీపీ వాసాల సతీశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 


భగవంతుడి ఆశీర్వాదంతోనే సకల విజయాలు : మంత్రి

సీఎం కేసీఆర్‌ భగవత్‌ భక్తుడని, భగవదాశీర్వాదంతోనే రాష్ట్రం సకల విజయాలను సొంతం చేసుకుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మల్లన్న కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించిన మంత్రి హరీశ్‌రావు అనంతరం రాజగోపుర ఆవరణలోని పంచాచార్య జగద్గురు, బసవేశ్వర విగ్రహాలను ఆవిష్కరించి, స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొమురవెల్లి మల్లన్న దయతో 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యిందని, ప్రస్తుతం 10 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.30 కోట్లతో మల్లన్న ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. గతేడాది వెండిద్వారాలు చేయిస్తామని ప్రకటించామని, చెప్పిన విధాంగానే పనులు పూర్తిచేయించి ప్రారంభించామన్నారు. వచ్చే కల్యాణంలోగా స్వామివారికి 3 కిలోల బరువైన బంగారు కిరీటాన్ని చేయించాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ సంకల్పించారని వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరోనా సంక్షభం నుంచి బయటపడి ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని మల్లన్నను వేడుకున్నామని తెలియజేశారు. ఆయన వెంట మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఎ్‌సఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, తదితరులు ఉన్నారు.


మల్లన్నను దర్శించుకున్న ‘ఈటల’

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆదివారం మల్లన్నను దర్శించుకుని పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత తోటబావి ప్రాంగణంలోని కల్యాణ మండపానికి వస్తారని భావించినప్పటికీ అనూహ్య పరిణామాల కారణంగా ఆలయంలోని స్వామివారిని మాత్రమే దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం ఆయన ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో  గెలిపించునందుకు కొమురవెల్లి మల్లన్నకు మొక్కుతీర్చామన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని, అధికారంలోకి రాగానే దేవాలయాభివృద్ధికి పాటుపడతామన్నారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతూ ధర్మం, న్యాయాన్ని కాపాడాలని ఆశీస్సులందించాలని మల్లన్నను వేడుకున్నామని తెలిపారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి బూరుగు సురేశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత మల్లేశం, మండలాధ్యక్షుడు దండ్యాల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సనాది కరుణాకర్‌, మహిళామోర్చ రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షురాలు స్వప్ననరే శ్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.
Updated Date - 2021-12-27T05:02:17+05:30 IST