మల్లన్న పెండ్లికొడుకాయేనే

ABN , First Publish Date - 2021-12-26T05:47:50+05:30 IST

కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జునస్వామి పెండ్లికొడుకయ్యాడు. ఆదివారం వీరశైవుల ఆడబిడ్డ అయిన మేడలాదేవీ, యాదవుల ఆడబిడ్డ అయిన కేతలాదేవిని వివాహమాడనున్నాడు. నేడు మల్లన్న ఆలయ తోటబావి ప్రాంగణంలో వీరశైవాగమశాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు.

మల్లన్న పెండ్లికొడుకాయేనే
తోటబావి వద్ద సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదిక

నేడు కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి కల్యాణం

తోటబావి వద్ద వేదిక ఏర్పాట్లు పూర్తి

కొమురవెల్లికి చేరుకున్న వీరశైవ పీఠాధిపతి 

నేటి నుంచి మూడు నెలల జాతరకు అంకురార్పణ


చేర్యాల, డిసెంబరు 25 : కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జునస్వామి పెండ్లికొడుకయ్యాడు. ఆదివారం వీరశైవుల ఆడబిడ్డ అయిన మేడలాదేవీ, యాదవుల ఆడబిడ్డ అయిన కేతలాదేవిని వివాహమాడనున్నాడు. నేడు మల్లన్న ఆలయ తోటబావి ప్రాంగణంలో వీరశైవాగమశాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఆలయ వర్గాలు, ప్రభుత్వ శాఖల అధికారులు స్వామివారి కల్యాణం కోసం ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. తోటబావి ప్రాంగణాన్ని గ్యాలరీలుగా విభజించి షామియానా, అరటి చెట్లు, మామిడితోరణాలు, గ్రీన్‌మ్యాట్‌తో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కల్యాణవేదికను రకరకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. మార్గశిరమాసం చివరి ఆదివారం రోజున నిర్వహించనున్న స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడునెలల జాతరకు అంకురార్పణ జరగనుంది. మల్లన్న కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందించనున్నారు. 


250 మందితో పోలీసుల బందోబస్తు

హుస్నాబాద్‌ ఏసీపీ వాసాల సతీశ్‌ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తును చేపట్టారు. సుమారు 250 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా జిల్లాలోని పలువురు తహసీల్దారుకు బాధ్యతలు అప్పగించారు. గతంలో కల్యాణోత్సవం సందర్భంగా వీవీఐపీ పాసులు దుర్వినియోగపరిచిన ఆరోపణలపై ధర్మకర్తల మండలి ఈసారి మార్పులు చేపట్టారు. ప్రొటోకాల్‌ ప్రకారం జాబితాను రూపొందించి పోలీసులకు అప్పగించారు. 


దర్శనం పునఃప్రారంభం

అలంకరణ నిమిత్తం ఆరు రోజుల క్రితం నిలిపివేసిన గర్భాలయ ప్రవేశం, మూలవిరాట్టు దర్శనం నేటినుంచి పునఃప్రారంభం కానుంది. ఆదివారం తెల్లవారుజామున బలిహరణ జరిపి, దృష్టికుంభం నిర్వహించనున్నారు. గుమ్మడికాయను బలిచ్చి స్వామివారికి చిత్రకన్నును అమరుస్తారు. అనంతరం విశేష పూజలు నిర్వహింపచేసి కల్యాణ వేడుకలను ప్రారంభించనున్నారు. కాశీ జ్ఞానసింహాసన మహాపీఠశాఖాధిపతి షట్‌స్థలబ్రహ్మ 108 శ్రీగురుసిద్ధ మణికంఠ శివాచార్యమహాస్వామి కొమురవెల్లికి చేరుకున్నారు. స్వామి పర్యవేక్షణలో  కల్యాణం నిర్వహించనున్నారు.  దృష్టికుంభం కోసం శనివారం రాత్రి గ్రామంలో వీరశైవార్చకులు రతీబియ్యాన్ని సేకరించారు. రాజగోపుర ఆవరణలోని జగద్గురు పంచాచార్య, బసవేశ్వర సిమెంట్‌ విగ్రహాలు ధ్వంసమవగా, వాటి స్థానంలో శిలావిగ్రహాలను ఏర్పాటు చేయగా నేడు మంత్రులు ఆవిష్కరించనున్నారు.


వ్యాక్సిన్‌ వేసుకున్న వారికే అనుమతి

స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాం. మాస్క్‌ ధరించడంతో పాటు వ్యాక్సినేషన్‌ వేసుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శనంతో పాటు కల్యాణ మండపంలోనికి అనుమతిస్తాం.

- ఆలయ ఈవో బాలాజీశర్మ


సమస్యల వలయంలో కొమురవెల్లి క్షేత్రం

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి పాలకులు హామీలిస్తున్నా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలేన్‌ కొమురవెల్లి నుంచే వెళుతుండగా ఇక్కడ స్టేషన్‌ ఏర్పాటుపై స్పష్టత కరువైంది. నాలుగేళ్లక్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.10 కోట్ల నిధులతో 50 గదుల సత్రం నిర్మాణం పనులు చేపట్టినా నత్తనడకన సాగుతున్నాయి. డార్మిటరీహాళ్లు, నెక్లెస్‌ రోడ్డు, ఎల్లమ్మగుట్టపై త్రిశూలం-ఢమరుకం.... 75 గదుల సత్రం, మాస్టర్‌ప్లాన్‌, ఆన్‌లైన్‌ సేవలు, క్యూలైన్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. మల్లన్న చెరువు మినీట్యాంక్‌బండ్‌ పనులు నిలిచిపోయాయి. నిత్యాన్నదాన సత్రంలో రోజూ అన్నవితరణ సంఖ్యను పెంచడం లేదు. రెగ్యులర్‌స్థాయి డిప్యూటీ కమిషనర్‌ నియామకానికి చర్యలు తీసుకోవడంలేదు. 


Updated Date - 2021-12-26T05:47:50+05:30 IST