మల్లన్న పెళ్లికి వేళాయె!

ABN , First Publish Date - 2021-12-25T05:43:23+05:30 IST

కోరమీసాల కొమురవెల్లి మల్లన్న పెళ్లి ఘడియలు సమీపిస్తున్నాయి.

మల్లన్న పెళ్లికి వేళాయె!
విద్యుత్‌ దీపాల కాంతిలో మల్లన్న ఆలయ రాజగోపురం

 నేడు వీరశైవ పీఠాధిపతి రాక.. రేపు  స్వామివారి కల్యాణం

 పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్న మంత్రి హరీశ్‌రావు

చేర్యాల, డిసెంబరు 24 : కోరమీసాల కొమురవెల్లి మల్లన్న పెళ్లి ఘడియలు సమీపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో స్వామివారి కల్యా ణం అంగరంగ వైభవంగా జరగనున్నది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో మల్లికార్జునస్వామి కేతలమ్మ, మేడలాదేవీను వివాహం ఆడనున్నారు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవాగమశాస్త్రం ప్రకారం నిర్వహించే కల్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 40 వేలమంది తరలిరానునండంతో ఇక్కట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు. నేడు వీరశైవ పీఠాధిపతి కాశీ జ్ఞానసింహాసన మహాపీఠశాఖాధిపతి షటస్థలబ్రహ్మ 108 శ్రీగురు సిద్ధ మణికంఠ శివాచార్యమహాస్వామి కొమురవెల్లికి చేరుకోనున్నారు. ఆయన పర్యవేక్షణలో కల్యాణ కైంకర్యం నిర్వహించనున్నారు.


కల్యాణమహోత్సవం ఇలా.. 

ఆనవాయితీ ప్రకారం గర్భాలయంలోనూ కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలో మహదేవుని వంశస్తులైన మహదేవుని మనోహర్‌-మమత దంపతులు కన్యాదాతలుగా వ్యవహరిస్తారు. కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశస్తులైన పడిగన్నగారి మల్లేశం-బాలమణి దంపతులు స్వామివారి తరఫున పాల్గొననున్నారు. ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్దకు తీసుకొచ్చి అశేష జనవాహిని మధ్య అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో కన్యాదాతలుగా మహదేవుని వంశస్తులైన మహదేవుని మల్లికార్జున్‌(చిన్న)-సుజాత దంపతులు వ్యవహరించనున్నారు. పడిగన్నగారి వంశస్తులైన పడిగన్నగారి మల్లికార్జున్‌-మాధవి దంపతులు కన్యాగ్రహీతలుగా మల్లన్న తరఫున వేడుకల్లో పాల్గొనున్నారు. భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 30 వేల మాస్క్‌లను సిద్ధం చేశామని ఈవో బాలాజీశర్మ తెలిపారు. కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు విక్రయించేందుకు 30 వేల లడ్డూప్రసాదాన్ని తయారీ చేశారు. అదే క్రమంలో పులిహోర ప్రసాద తయారీకి చర్యలు చేపట్టారు. మల్లన్న కల్యాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, టీఎ్‌సఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద గిరిరెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. 


భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి

స్వామివారి కళ్యాణానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. కనులారా స్వామివారి కల్యాణం తిలకించేలా డోనర్లు, వీఐపీ, స్థానికుల వారీగా గ్యాలరీలు ఏర్పాటుచేయించాం.  

Updated Date - 2021-12-25T05:43:23+05:30 IST