నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతా

ABN , First Publish Date - 2021-12-29T05:09:06+05:30 IST

నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ఎజెండాగా పనిచేస్తానని సిద్దిపేట సీపీ శ్వేత అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతా

  ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటా

 బాధ్యతాయుతంగా పని చేస్తా   

 ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో జిల్లా సీపీ శ్వేత 


సిద్దిపేట క్రైం, డిసెంబరు 28: నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ఎజెండాగా పనిచేస్తానని సిద్దిపేట సీపీ శ్వేత అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.


జిల్లాలో జరిగే నేరాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?


జిల్లాలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి? ఏ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి? ఏ విధంగా జరుగుతున్నాయి? పాత నేరస్తులు, రౌడీలు జిల్లాలో ఎంతమంది ఉన్నారని, పరిశీలించి, ప్రత్యేక దృష్టి సారించి నేరాలను అదుపు చేస్తాను. రాజీవ్‌రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపడతాను. నేర రహిత పోలీస్‌ కమిషనరేట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తాను.


ఫ్రెండ్లీ పోలీసింగ్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌తో ఎలాంటి చర్యలు చేపడతారు?


జిల్లాలో ప్రజలందరికీ పోలీసులు అంటే నమ్మకం కలిగేలా, ఏ సంఘటన జరిగినా నేరుగా పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ధైర్యంగా చెప్పే విధంగా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయ్యింది. ఇంకా ఎక్కడైనా సీసీ కెమెరాలు లేనిచోట అవగాహన కల్పించి ఏర్పాటు చేయిస్తా. చట్టాల గురించి ప్రజలకు తెలియజేస్తాం.


జిల్లాలో  మొట్టమొదటి  మహిళా సీపీగా  వచ్చిన మీరు ఎలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెడతారు?


ప్రతి రోజూ ఆఫీ్‌సలో ఉంటూ ప్రజల సమస్యలు చెప్పుకునే విధంగా అందుబాటులో ఉంటాను. జిల్లాలో జరిగే ప్రతీ క్రైం కేసులో ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులను త్వరగా పట్టుకుని శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాను. కామారెడ్డి జిల్లాలో ఎస్పీగా పని చేసినప్పుడు మహిళా రక్షణ చట్టాలు, అత్యవసర సమయాల్లో చేయాల్సిన ఫోన్‌ నంబర్లు, స్వీయ రక్షణ వంటి మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాను. సిద్దిపేటలో కూడా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాను. 


సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటారు?


సిద్దిపేట జిల్లాలో ప్రముఖులు ఎక్కువగా తిరిగే ప్రాంతం. కాబట్టి ఎవరికీ ఇబ్బంది కలుగకుండా, బాధ్యతాయుతంగా వృత్తిని కొనసాగిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతాను.


మీ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు?


మా స్వస్థలం తలకోలపల్లి రంగారెడ్డి జిల్లా. పదో తరగతి వరకు శిశు మందిర్‌లో చదివాను. అనంతరం ఇంటర్‌, బీటెక్‌ పూర్తి అయిన తర్వాత ఎమ్మెస్‌కు అమెరికాకు వెళ్లాను. మధ్యలోనే తిరిగి వచ్చి సివిల్స్‌ పరీక్ష రాసి 2012లో ఎంపికయ్యాను. మొదట ఆంధ్రప్రదేశ్‌ గ్రేహౌండ్స్‌ సీఐడీగా ఆరు నెలలు, అనంతరం ఖమ్మం జిల్లా చింతూరులో ఎస్‌డీపీవోగా పని చేశాను. 2016లో కామారెడ్డి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఐదు సంవత్సరాల రెండు నెలలు పనిచేశాను.


 

Updated Date - 2021-12-29T05:09:06+05:30 IST