హిందువుల సంఘటితం కోసమే మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-03-24T05:49:50+05:30 IST

భగవన్నామ స్మరణ, ధర్మ పరిరక్షణతోనే మోక్షం లభిస్తుందని, ఈ విషయం గుర్తెరిగి మనుషులు మసలుకోవాలని బిచ్కుంద పీఠాధిపతి సోమలింగ శివాచార్య సూచించారు.

హిందువుల సంఘటితం కోసమే మహాపాదయాత్ర
గజ్వేల్‌ పాదయాత్రలో భాగంగా మాట్లాడుతున్న బిచ్కుంద పీఠాధిపతి

బిచ్కుంద పీఠాధిపతి సోమలింగ శివాచార్య

దౌల్తాబాద్‌ నుంచి రాయపోల్‌ మీదుగా గజ్వేల్‌ వరకు సాగిన యాత్ర

గజ్వేల్‌/రాయపోల్‌, మార్చి 23 : భగవన్నామ స్మరణ, ధర్మ పరిరక్షణతోనే మోక్షం లభిస్తుందని, ఈ విషయం గుర్తెరిగి మనుషులు మసలుకోవాలని బిచ్కుంద పీఠాధిపతి సోమలింగ శివాచార్య సూచించారు. హిందువులపై, హిందూ దేవాలయాలపై ఇటీవలి కాలంలో దాడులు ఎక్కువయ్యాయని, హిందువులందరికీ భగవంతుడు సద్బుద్ధిని, సంఘటితమయ్యే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ తాను కామారెడ్డి జిల్లా బిచ్కుంద మఠ సంస్థాన్‌ నుంచి చేపట్టిన మహా పాదయాత్ర యాదాద్రి జిల్లా కొలనుపాక సోమేశ్వర ఆలయం వరకు సాగుతుందని తెలిపారు. ఈ నెల 17న ప్రారంభమైన ఆయన మహాపాదయాత్ర మంగళవారం దౌల్తాబాద్‌, రాయపోల్‌ మీదుగా గజ్వేల్‌ వరకు సాగింది. గజ్వేల్‌లో రాత్రి కోటమైసమ్మ నుంచి పాదయాత్ర అనంతరం ప్రజ్ఞగార్డెన్‌లో నిర్వహించిన ధర్మసభలో ఆయన ప్రసంగించారు. అన్ని జీవరాశుల్లోకెల్లా మనుషులకు మాత్రమే మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఉందని, అలాంటి జ్ఞానాన్ని భక్తి మార్గంలో వినియోగించుకోవాలని సూచించారు. అన్ని కులాలు ఒక్కటేనని జగద్గురు రేణుకాచార్యులు ఆనాడే చెప్పారని, కులాల మధ్య అంతరం పోయి వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌ అనే భావన రావాలని సోమలింగ శివాచార్య ఆకాంక్షించారు. కులాలకతీతంగా హిందువులు సంఘటితమై సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. స్వామీజీ వెంట కాసం వీరేశం, ప్రభాకర్‌, మల్లేశం, శరణప్ప, కరుణాకర్‌, అభిషేక్‌, శివకుమార్‌తో పాటు వీరశైవ సమాజం సభ్యులు, పలు మండలాల మహేశ్వర అర్చకులు ఉన్నారు. కాగా, మధ్యాహ్నం రాయపోల్‌లో పీఠాధిపతికి రవీందర్‌రెడ్డి, జంగం మాణిక్యం, దయాకర్‌రెడ్డి, బాల్‌లక్ష్మి తదితరులు ఘనస్వాగతం పలికారు. బుధవారం వేకువజామున గజ్వేల్‌ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర అక్కారం, గణే్‌షపల్లి మీదుగా సాగి రాత్రి జగదేవపూర్‌ చేరుకోనున్నది. 

Updated Date - 2021-03-24T05:49:50+05:30 IST