శ్రీమన్నారాయణ ఆశీస్సులతో దుబ్బాకకు వెలుగు

ABN , First Publish Date - 2021-08-22T04:43:14+05:30 IST

శ్రీబాలాజీ వేంకటేశ్వరాలయం నిర్మాణంతో దుబ్బాకకు శ్రీమన్నారాయణ ఆశీస్సులు కలిగాయని, దుబ్బాక దేదీప్యమానంగా వెలుగుతుందని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు.

శ్రీమన్నారాయణ ఆశీస్సులతో దుబ్బాకకు వెలుగు
తీర్థగోష్టిలో చినజీయర్‌ స్వామి

 తీర్థగోష్టిలో త్రిదండి చినజీయర్‌ స్వామి


దుబ్బాక, ఆగస్టు 21: శ్రీబాలాజీ వేంకటేశ్వరాలయం నిర్మాణంతో దుబ్బాకకు శ్రీమన్నారాయణ ఆశీస్సులు కలిగాయని, దుబ్బాక దేదీప్యమానంగా వెలుగుతుందని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. శనివారం ఆలయంలో ఆయన తీర్థగోష్టి, కార్యక్రమం, సమాశ్రేయణం, మంత్రోపదేశం నిర్వహించారు. సుమారు 150 మంది సమాశ్రేయణం పొందారు. వైదిక బృందం డాక్టర్‌ ఎంఎన్‌చారి, మంగళగిరి నవీన్‌, పదీప్‌, కిరీటీలకు ఆశీస్సులు అందించారు. దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నెవనితారెడ్డి తీర్థగోష్టిలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిక్కిరిసింది. కాగా శుక్రవారం శ్రీవారి కల్యాణానికి కొన్ని కుటుంబాలకు చెందిన వారే పూర్తి స్థాయిగా టిక్కెట్లను తమవద్దే ఉంచుకోవడంతో కల్యాణంలో పాల్గొనే భాగ్యం ఆలయ దాతలకు కరువైంది. ఆలయ అభివృద్ధికి ఒక నాయకుడు సుమారు 5లక్షల 16వేల రూపాయాలు విరాళంగా ఇచ్చినా శుక్రవారం ఆలయ దర్శనానికి అనుమతినివ్వలేదు. ఆలయ కమిటీ సుమారు 20 వేల మంది భక్తులు వస్తారని భావించారు. కానీ కమిటీ నిర్వాకంతో దుబ్బాకలోని అన్ని కులసంఘాలు ఆలయానికి రాలేదు. చినజీయర్‌ స్వామి ప్రవచనాల సమయంలో కేవలం 15వందల నుంచి 2వేల మంది వరకే జనం ఉన్నారు. 


దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకోవాలి


శ్రీబాలాజీ దేవాలయానికి కామన్‌ గుడ్‌ ఫండ్‌, సీఎం ప్రత్యేక నిధులను కేటాయించారని, ట్రస్టు ఆధీనంలో ఉంటే ప్రజలకు దర్శన భాగ్యం ఉండదని పలు కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకోవాలని  మంత్రి హరీశ్‌రావును, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని దుబ్బాక ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఆర్‌.రాజమల్లు కోరారు. 

Updated Date - 2021-08-22T04:43:14+05:30 IST