వెలుగుచీకట్లు

ABN , First Publish Date - 2021-12-30T05:48:53+05:30 IST

వెలుగుచీకట్లు

వెలుగుచీకట్లు

2021 సంవత్సరంలో ఎత్తుపల్లాలను చవిచూసిన జిల్లా

కుటుంబాలను ఛిద్రం చేసిన కరోనా

రెండోదశలో సుమారు 200 మంది బలి

జిల్లాలో ప్రతిపక్షపార్టీల జంగ్‌ సైరన్‌

నీళ్లున్నా రైతులకు తప్పని కన్నీళ్లు

గాడినపడ్డ విద్యారంగం.. వైద్యానికి ఊతం

పలువురికి పదవుల యోగం

సాగునీటి రంగంలో ఒడిదుడుకులు

అభివృద్ధి పరంగా కీలక అడుగులు

హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు ఎక్కువే


కాలగమనంలో 2021 సంవత్సరం సిద్దిపేట జిల్లాకు వెలుగుచీకట్లను మిగిల్చింది. ఈ ఏడాది జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి ఈ ఏడాదిలోనూ విజృభించింది. వేలాది మందికి వైరస్‌గా సోకగా జిల్లాలో సుమారు 200 మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ కరోనా చేదు జ్ఞాపకాలను పక్కనబెడితే జిల్లాలో అభివృద్ధి పరంగా కీలక అడుగులు పడ్డాయి. జిల్లాలో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ రైతుల కంట కన్నీళ్లు తప్పలేదు. సాగునీటి రంగంలో ఎత్తుపల్లాలు చోటు చేసుకోగా.. విద్యా, వైద్య రంగాలు గాడినపడ్డాయి. పలు రాజకీయ పార్టీలు తమ పోరాటానికి జిల్లాను వేదికగా మార్చుకున్నాయి. సిద్దిపేట బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయఢంకా మోగించింది. పలువురికి పదవీ యోగం పట్టింది. ఇక అసాంఘిక కార్యకలాపాలు, హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల్లో ఈ ఏడాది కూడా నియంత్రణ లేకపోయింది. 

- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 29


సిద్దిపేట జిల్లా 2021వ సంవత్సరంలో అభివృద్ధిలో కీలక అడుగులు వేసింది. జూన్‌ 20వ తేదీన సిద్దిపేట జిల్లాకు గుండెకాయ లాంటి కలెక్టరేట్‌ నూతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. అదే విధంగా సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాన్ని ప్రాంభించారు. ఐటీ టవర్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి స్థానిక కౌన్సిలర్లతో మాట్లాడారు. 

-ఏప్రిల్‌ 6వ తేదీన కొండపోచమ్మ కాలువ నుంచి సంగారెడ్డి కెనాల్‌కు గోదావరి జలాలను సీఎం కేసీఆర్‌ విడుదల చేశారు.  

-సిద్దిపేట పట్టణ శివారులో త్రీస్టార్‌ రేంజ్‌ టూరిజం హోటల్‌ను డిసెంబరు 24వ తేదీన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

-తడిచెత్తతో బయోగ్యాస్‌ను తయారుచేసే రాష్ట్రంలోనే మొదటి ప్లాంటును సిద్దిపేట మున్సిపల్‌ డంపుయార్డులో డిసెంబరు 20న బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. 


సాగునీటి రంగంలో..

-కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద రిజర్వాయర్‌ అయిన శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలను ఆగస్టు 22వ తేదీన ఎత్తిపోశారు. 50టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 10టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అదే విధంగా రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లోనూ జలకళ సంతరించుకున్నది. 

-కాగా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో 14 గ్రామాలు ముంపునకు గురికాగా ఇప్పటికీ నిర్వాసితుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, నివాసిత స్థలాలు ఇవ్వలేదని ఆందోళనలు చేస్తున్నారు. 

-మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న 8.5టీఎంసీల గౌరవెల్లి రిజర్వాయర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. నిర్వాసితులకు నిబంధనల ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులకు, నిర్వాసితుల నడుమ తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఇంకా 10 శాతం పనులు మిగిలి ఉన్నాయి. 

-మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు నిర్మిస్తున్న అదనపు టీఎంసీ భారీ కాలువకు అడుగుడుగునా ఆటంకాలే ఉన్నాయి. విలువైన భూముల్లో నుంచి ఈ కాలువను నిర్మిస్తుండడం.. ఎకరాకు రూ.8లక్షలు మాత్రమే పరిహారం ఇవ్వడం సమస్యగా మారింది. తుక్కాపూర్‌ వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌ వద్ద నిత్యం ఆందోళనలే చోటుచేసుకుంటున్నాయి. 


వ్యవసాయానికి ప్రతికూలం

-జిల్లాలోని రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ రైతులకు కన్నీళ్లు తప్పలేదనే విమర్శలు ఉన్నాయి. గడిచిన వానాకాలంలో 2.37 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. వచ్చే యాసంగిలో వరిసాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్ల వరి పండిస్తే రైతులకు నష్టం వాటిల్లుతుందని చెప్పడంతో తర్జనభర్జన పడుతున్నారు. 

-గత వానాకాలంలో 45వేల ఎకరాల్లో మక్కజొన్న, 1.65లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగుచేసినప్పటికీ భారీ వర్షాలకు దిగుబడి తగ్గింది. వరి ధాన్యం దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. 

-ఈ ఏడాది కొత్తగా జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టారు. రాష్ట్రంలో ఖమ్మం, నల్లగొండ జిల్లాల తర్వాత సిద్దిపేటలోనే అత్యధికంగా 1200 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేశారు. 

-వరిసాగుకు అనుకూలంగా ఉన్న జిల్లా నేలల్లో యాసంగి వరిసాగు వద్దన్నప్పటికీ 70శాతం రైతులు ఇప్పటికే వరిసాగు చేపట్టారు. 


ప్రతిపక్షాల పోరుబాట

-టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం సెప్టెంబరు 17న గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జునఖర్గే హాజరయ్యారు. 

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జిల్లాలో ఐదురోజులు కొనసాగింది. ముగింపు సభ అక్టోబరు 2న హుస్నాబాద్‌లో నిర్వహించగా కేంద్రమంత్రి స్మృతిఇరానీ హాజరయ్యారు. 

-వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల ఆగస్టు 31న గజ్వేల్‌లో నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. 

-సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం సిద్దిపేట కేంద్రంగా రాష్ట్ర స్థాయి సభలను నిర్వహించారు. 


గాడినపడిన విద్యారంగం

-2020 మార్చిలో లాక్‌డౌన్‌ నుంచి గడిచిన సెప్టెంబరు నెలవరకు ఆటుపోట్ల నడుమనే విద్యారంగం కొనసాగింది. కొద్దిరోజులు ఆన్‌లైన్‌..తర్వాత ఆఫ్‌లైన్‌ పాఠాలు బోధించారు. ఏడాదిన్నర కాలం విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెప్టెంబరు నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. 

-ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని 976 ప్రభుత్వ పాఠశాలలు, 16 ఎస్సీ గురుకులాలు, 8 బీసీ, 3 ఎస్టీ, 6 మైనార్టీ గురుకులాలు, 14 మోడల్‌ స్కూళ్లు, 22 కస్తూర్బా పాఠశాలలు నడుస్తున్నాయి. మొత్తంగా 1,056 ప్రభుత్వ సంబంధిత పాఠశాలల్లో 1,01,772 మంది విద్యార్థులు చదువుతున్నారు.

-ఇటీవలే ములుగులోని హార్టికల్చర్‌ యూనివర్సిటీలో స్నాతకోత్సవ ఉత్సవాలు జరిగాయి. దీనికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. 

-సిద్దిపేటలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 


వైద్యరంగంలో వెలుగులు

-కరోనా కాలంలో ఆక్సిజన్‌ సమస్య నుంచి గట్టెక్కడానికి జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. 

-మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. ఈ అకాడమిక్‌ సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించనున్నారు. 

-సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని ఉచిత డయాగ్నస్టిక్‌ సెంటర్‌, ఉచిత సిటీ స్కానింగ్‌ సెంటర్లను ఇదే ఏడాది ప్రారంభించారు. 40 పడకల ఐసీయూ, 20 బెడ్లతో డయాలసిస్‌ కేంద్రాలను తీర్చిదిద్దారు. 

-దుబ్బాకలో 100పడకల ఆస్పత్రిని ఇటీవల మంత్రి హరీశ్‌ ప్రారంభించారు.


హరీశ్‌, పలువురికి పదవులు

-రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలను అప్పగించారు. 

-ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గజ్వేల్‌కు చెందిన వంటేరు యాదవరెడ్డి గెలుపొందారు. 

-చిన్నకోడూరు మండలం గంగాపూర్‌కు చెందిన ఎర్రొళ్ల శ్రీనివా్‌సను రాష్ట్ర వైద్యసేవలు, మౌళిక వసతుల కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవి వరించింది.

-రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న వంటేరు ప్రతాపరెడ్డి పదవీకాలాన్ని ఈ నెలలోనే మరో రెండేళ్లు పొడిగించారు. 

-టీటీడీ బోర్డు సభ్యుడిగా మురంశెట్టి రాములుకు మరో రెండేళ్ల పాటు అవకాశం కల్పించారు. 


తగ్గని నేరాలు, ప్రమాదాలు

-ఫిబ్రవరి 4న సిద్దిపేట పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కోటగిరి నాగరాజు(34) భార్య, కుతూరుతో రంగనాయకసాగర్‌ను చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతవ్వగా ఫిబ్రవరి 5న మృతదేహం లభ్యమైంది.

-ఫిబ్రవరి 21వ తేదీన సిద్దిపేట పట్టణ శివారులోని నాగదేవత గుడి బైపా్‌సరోడ్‌లో 16 గోవులను దుండగులు హతమార్చారు. ఈ సంఘటనలో 8 మంది నిందితులకు 15 రోజులు రిమాండ్‌ విధించారు.

-మార్చి7న చిన్నకోడూరుకు చెందిన టేకు లలిత(26)ను సిద్దిపేట రంగాధాంపల్లికి చెందిన భర్త గుంతుక రాజు అనుమానంతో గొంతుపై, కడుపులో కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతూ మార్చి 9న మృతి చెందింది.

-మార్చి 18న గజ్వేల్‌లో మూడంతస్తుల భవనం కూలింది. 

-ఏప్రిల్‌ 8న సిద్దిపేట పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి విగ్గలం కార్తీక్‌(15) స్నేహితులతో కలిసి రంగనాయక సాగర్‌ను చూడటానికి వెళ్లగా మట్టి దిబ్బపై నిలబడి స్నేహితుడితో సెల్ఫీ దిగుతున్న సమయంలో మట్టి కూలి నీటిలో పడి గల్లంతవ్వగా ఏప్రిల్‌ 10న మృతదేహం లభ్యమైంది.

-మే 10న గజ్వేల్‌ మండలం అహ్మదిపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనుమరాలు మృతిచెందారు.

-జూన్‌26న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ శివారులో మడద గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు గుగ్గిల్లపు సారవ్వ(60), ఉసికే నిర్మల(30) దారుణ హత్యకు గురయ్యారు.

-జూన్‌ 18న మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన తొగుట మండలం వేములఘాట్‌లో ఆర్‌అండ్‌ఆర్‌ రాలేదని అధికారులు కూల్చిన తన ఇంట్లోనే కట్టెలను చితిగా పేర్చుకొని రైతు తుటుకూరి మల్లారెడ్డి ఆత్మబలిదానం చేసుకున్నాడు.

-సెప్టెంబరు5న గోనెపల్లి వాగు సమీపంలోని తాటి చెట్ల వద్ద కుటుంబసభ్యులతో సరదాగా గడపటానికి వచ్చి ముంబైకి చెందిన సురేష్‌(24) (అలియాస్‌ సర్వేశ్‌,రాజేశ్‌ సింగ్‌), సురేశ్‌బంధువైన మధ్యప్రదేశ్‌లోని ఈటావాకు చెందిన తోమర్‌ జైసింగ్‌(19) ఇద్దరు యువకులు స్నానం చేయడానికి వాగులో దిగారు. జైసింగ్‌కు ఈత రాకపోవడంతో నీటి ప్రహవానికి కొట్టుకుపోతుండటంతో కాపాడటానికి వెళ్లిన సురేష్‌ కూడ గల్లంతయ్యారు. సెప్టెంబరు 6న ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సిద్దిపేట పట్టణంలో జరిగిన రెండు వరుస చోరీల్లో తోమర్‌ జైసింగ్‌ నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

-సెప్టెంబరు 7న మిరుదొడ్డి మండలం ధర్మారంలో కుటుంబకలహాలతో భార్యభర్త ఇంట్లో ఉరేసుకున్నారు.

-సెప్టెంబర్‌ 26న కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన మామ మేదరి రాజు(27), అల్లుడు రితీష్‌(11) మోయ తుమ్మెద వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లి గత సంవత్సరం గల్లంతయ్యారు.

-మే నెలలో కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాతో మృతి

-అక్టోబర్‌ 2న కొండపాక మండలం దుద్దేడలో మర్కుక్‌ మండలం అంగడి కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన మండల స్వరూప (45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి మురికి కాలువలో పడేశారు.

-డిసెంబర్‌ 25న కొండపాక మండలం సిర్సానగండ్లలో కుటుంబకలహాలతో కలత చెందిన గువ్వల నవిత ఏడాదిన్నర కుమారునితో పాటు కిరోసిన్‌ పోసుకుని తగలబెట్టుకున్నది. 

-డిసెంబర్‌ 13వ తేదీన చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన జవాన్‌ సాయికిరణ్‌రెడ్డి మిస్సింగ్‌ అయ్యాడు.

-డిసెంబర్‌ 13వ తేదీన రాజీవ్‌ రహదారి కొడకండ్ల వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి.


ఈ ఏడాదిలో క్రైం కేసులు

ఆస్తి కోసం హత్య..............................3

అత్యాచారకేసులు...........................70

వరకట్న హత్యా కేసులు....................  1

వరకట్న వేధింపు మరణాలు..........       7

వరకట్న ఆత్మహత్యలు.................... 10

గుట్కా కేసులు............................... 12

అక్రమ ఇసుక రవాణా కేసులు..          165

సైబర్‌ కైరమ్‌లు.............................43

దోపిడీలు....................................... 5

దొంగతనం కేసులు........................ 646

గొలుసు దొంగతనల కేసులు...........       8

దొంగతనాలలో రూ.2,68,52,261 చోరీ కాగా రూ.34,27,000 రికవరీ చేశారు.

జిల్లాలో 744 రోడ్డు ప్రమాదాలు జరుగగా 281 మంది చనిపోయారు. 706 మందికి గాయాలయ్యాయి. జిల్లాలో 428 మిస్సింగ్‌ కేసులు నమోదు కాగా వారిలో 35 మంది ఆచూకీ లభ్యం కాలేదు. జిల్లాలో 86 డ్రంకెన్‌ డైరవ్‌ కేసులు నమోదు కాగా రూ.34,27,00,000 జరిమానా విధించారు. 86 మందికి జైలు శిక్ష పడింది. 39 పేకాట కేసులు నమోదవగా 282 మంది అరెస్టయ్యారు.


Updated Date - 2021-12-30T05:48:53+05:30 IST