లింగవివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం
ABN , First Publish Date - 2021-09-04T05:00:20+05:30 IST
లింగ వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించడానికి ప్రతీఒక్కరు ముందుకురావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితారెడ్డి పేర్కొన్నారు.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితారెడ్డి
చిల్‌పచెడ్, సెప్టెంబరు 3: లింగ వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించడానికి ప్రతీఒక్కరు ముందుకురావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గౌతాపూర్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో లింగవివక్ష నిర్మూలనపై అవగాహనా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఇప్పటికీ మహిళలు, బాలికలపై వివక్ష కనిపించడం విచారకరమని పేర్కొన్నారు. సమాన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం బాలికలు, మహిళలను ప్రోత్సహిస్తున్నదని స్పష్టం చేశారు. అనంతరం డీడబ్ల్యూవో జయరాం మాట్లాడుతూ తల్లిదండ్రులు మగ పిల్లలకు చిన్నతనం నుంచే మహిళలను గౌరవించడం నేర్పించాలన్నారు. మండలంలో బాల్య వివాహాలు, శిశువిక్రయాలు తగ్గిపోయాయని తెలియజేశారు. సఖి అధికారి శాంత మాట్లాడుతూ బాలికలు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంకోచించకుండా సఖీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామాల్లో వివాహాలు జరిగినప్పుడు వధూవరుల వివరాలను సర్పంచులు, కార్యదర్శులు, అంగన్‌వాడి సేకరించాలన్నారు. గౌతాపూర్ పాఠశాల హెచ్‌ఎం మదన్‌మోహన్ మాట్లాడుతూ తమ పాఠశాలకు 3 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థినులు కాలినడకన వస్తుంటారని, వారికి సైకిళ్లను అందజేయడానికి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సీడీపీవో హేమభార్గవి పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, ఎంపీడీవో శశిప్రభ, సర్పంచ్ లక్ష్మీదుర్గారెడ్డి, ఎన్జీవో సభ్యురాలు సునిత తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే కొనసాగించాలని కోరాం
నర్సాపూర్, సెప్టెంబరు 3: మెదక్ జిల్లాను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉంచాలని మంత్రులను లిఖితపూర్వకంగా కోరినట్టు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లోని తన స్వగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లాను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి మార్చితే ఇక్కడి విద్యార్థులకు సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. విద్యార్థి సంఘాలు, కాలేజీల అసోసియేషన్ల విజ్ఞప్తి మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌లను కలిసి వినతిపత్రం అందజేశామని, వారు సానుకూలంగా స్పందించారని ఆమె తెలియజేశారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నయిమొద్దీన్, కౌన్సిలర్ అశోక్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహులు, మాజీ ఎంపీటీసీ సత్యంగౌడ్, మాజీ ఉపసర్పంచ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.