సిద్దిపేటను చెత్తరహితంగా తీర్చిదిద్దుదాం: కమిషనర్
ABN , First Publish Date - 2021-05-20T06:33:35+05:30 IST
సిద్దిపేట పట్టణంలో వంద శాతం చెత్త సేకరణ జరగాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి పేర్కొన్నారు.

సిద్దిపేట సిటీ, మే 19: సిద్దిపేట పట్టణంలో వంద శాతం చెత్త సేకరణ జరగాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి పేర్కొన్నారు. పట్టణంలో దాదాపు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తను విభజించి ఉదయాన్నే వచ్చే చెత్త వాహనానికి ఇస్తున్నారని, తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టాలని ఆయన సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై మన ఇళ్లలో నుంచి వచ్చే చెత్తను మనమే ఉపయోగించుకోవాలని చెప్పారు. తడి చెత్త ద్వారా ఇంట్లోనే ఎరువు తయారీ చేసుకోవాలని వివరించారు. మన సిద్దిపేట పట్టణాన్ని చెత్త రహిత పట్టణంగా నిలిపేందుకు పురపాలక సిబ్బంది, పుర ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఇటీవల సిద్దిపేట పట్టణం నుంచి బెంగుళూరుకు సిద్దిపేట మున్సిపల్ బృందం జీరో సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అవగాహన కోసం బెంగుళూరుకు వెళ్లి పరిశీలించామని వివరించారు. సిద్దిపేటను కూడా జీరో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నగరంగా తీర్చి దిద్దుకోవాలని అందుకు అందరం కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నందున పట్టణంలో ప్లాస్టిక్ వాడకుండా చూస్తున్నామన్నారు. అందరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దీప్తి, సానిటరీ ఇన్స్పెక్టర్‌లు సతీష్, బాల ఎల్లం, సాజిద్, జవాన్‌లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.