కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-21T05:31:29+05:30 IST

పోలీసు బాస్‌ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశారు. గురువారం సడలింపు సమయం గడిచిపోగానే ఉమ్మడి జిల్లాలో ఎక్కడికక్కడ పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపైకి వచ్చే వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

 రంగంలోకి దిగిన పోలీసులు

ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా తనిఖీలు

రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు హెచ్చరికలు

పలువురిపై కేసు నమోదు, వాహనాల సీజ్‌

కట్టడితో కరోనా కేసులు తగ్గుముఖం 

సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌


సంగారెడ్డి క్రైం, మే 20 :  పోలీసు బాస్‌ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశారు. గురువారం సడలింపు సమయం గడిచిపోగానే ఉమ్మడి జిల్లాలో  ఎక్కడికక్కడ పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపైకి వచ్చే వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.  పలు వాహనాలను సీజ్‌ చేశారు. సంగారెడ్డిలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రాపురంలో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌, సిద్దిపేటలో సీపీ జోయల్‌ డేవిస్‌ పర్యటించి లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు. 

లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ అమలు పరిస్థితిని ఆయన గురువారం స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పది గంటల లోపే దుకాణాలు, హోటళ్లు, అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని, ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.


కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి

రామచంద్రాపురం, మే 20 : కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించి ప్రజలు సహకరించాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కోరారు. గురువారం ఉదయం రామచంద్రాపురం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ అమలును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయడంతో ఇటీవల కొంతమేర కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. కేసులను తగ్గించాలన్న లక్ష్యంతో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన 16వేల మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇక మీదట అనవసరంగా బయటకు వచ్చే వారి వాహనాలు జప్తు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌లో ప్రజలకు కల్పించిన నాలుగు గంటల మినాహాయింపు  సమయంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర వస్తువుల కొనుగోలు, ఇతర పనులు పూర్తి చేసుకోవాలన్నారు. పది గంటల తరువాత అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు. పోలీసుల కఠిన చర్యలు ప్రజల కోసమేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సీపీ వెంట మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, మియాపూర్‌ ఏసీపీ కృష్ణప్రసాద్‌, సీఐలు సంజయ్‌కుమార్‌, కిస్టో, వెంకటేశం, ఎస్‌ఐలు కోటేశ్వర్లు, రవికుమార్‌ తదితరులున్నారు. 


నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు 

సిద్దిపేట సిటీ, మే 20: సరైన కారణం లేకుండా ఎవరైనా తమ వాహనాలపై బయట తిరుగుతూ కనబడినచో వారి వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేస్తామని పోలీస్‌ కమిషనర్‌ డి జోయల్‌ డేవిస్‌ అన్నారు. గురువారం లాక్‌డౌన్‌ సందర్భంగా సిద్దిపేట పట్టణం మెదక్‌ రోడ్డు హై స్కూల్‌ గ్రౌండ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌, మరియు కరీంనగర్‌రోడ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, ప్రదేశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి రెండవ విడత భయంకరంగా వ్యాపిస్తూ వేలాది మందిని కబళిస్తున్న నేపథ్యంలో,  ప్రభుత్వం ఆ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడుటకు లాక్‌డౌన్‌   విధించడమైనదన్నారు. యువకులు ఇంటి నుండి బయటకు వచ్చి రోడ్లపై తిరుగుతూ కనబడినట్టు అయితే వారిపై కఠిన అచర్యలు తీసుకోవడమే కాకుండా చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. తమ పిల్లలు బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రులపై వున్నదన్నారు.

Updated Date - 2021-05-21T05:31:29+05:30 IST