తాతల నాటి భూమి కబ్జా

ABN , First Publish Date - 2021-08-21T06:10:49+05:30 IST

తాతల కాలం నుంచి ఓ రైతు కుటుంబం భూమిని సాగుచేసుకుంటున్నది.

తాతల నాటి భూమి కబ్జా
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద భూమి పత్రాలతో బాధిత రైతు, భూమి పాస్‌బుక్‌

 ఆరేళ్ల క్రితం రైతు నుంచి స్వాధీనం చేసుకున్న నాయకుడు

 గవర్నర్‌, సీఎంలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు  

 అధికారుల వత్తాసు అధికార నాయకుడికే!

 న్యాయం చేయాలని ‘ఆంధ్రజ్యోతిని ఆశ్రయించిన బాధితుడునర్సాపూర్‌, ఆగస్టు 20: తాతల కాలం నుంచి ఓ రైతు కుటుంబం భూమిని సాగుచేసుకుంటున్నది. పలుకుబడి ఉన్న ఓ నాయకుడు ఆ భూమి తనదేనంటూ తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఆ రైతు కుటుంబం రోడ్డున పడినట్టయ్యింది. తనకు న్యాయం చేయాలని అధికారులు, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. విసిగిపోయి గవర్నర్‌, సీఎంల పేషీలో ఫిర్యాదు చేసినా అదే పరిస్థితి. చివరకు తనకు న్యాయం జరిపించాలంటూ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించాడు.  వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన గొల్ల శివయ్య కథనం ప్రకారం... కొంతాన్‌పల్లి పరిధిలోని సర్వే నెంబరు 349లో ఎకరా 37 గుంటల భూమి తాత, తండ్రుల నుంచి సాగు చేసుకంటున్నారు. అయితే ఈ భూమి తనదంటూ స్థానికంగా పలుకుబడి గల ఓ అధికార పార్టీ నాయకుడు అధికారుల సహకారంతో ఆరేళ్ల క్రితం తన కబ్జాలోకి తీసుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు సర్వే చేసి, సదరు నాయకుడికి అనుకూలంగా వ్యహరించారు. అటవీ ప్రాంతంలో నీ భూమి ఉంది, అక్కడే సాగుచేసుకోవాలంటూ సూచించారని బాధితుడు వాపోయాడు. అందుకైనా సిద్ధపడి రెవెన్యూ,అటవీ జాయింట్‌ సర్వే కూడా చేయించినట్టు తెలిపాడు. అయితే సర్వే సంబంధించిన రిపోర్టు ఇవ్వకపోగా, భూమిని కూడా చూపలేదు. దీంతో రెండేళ్ల క్రితం మంత్రి హరీశ్‌రావు, అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపాడు.  ఫలితం లేకపోవడంతో జూలై 31న ముఖ్యమంత్రి పేషీలో, ఆగస్టు 8న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో, కొత్తగా వచ్చిన తహసీల్దార్‌ను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నట్టు చెప్పాడు.  

 

Updated Date - 2021-08-21T06:10:49+05:30 IST