గర్జనకు కదిలి రావాలి

ABN , First Publish Date - 2021-10-22T05:29:32+05:30 IST

వరంగల్‌లో నవంబరు 15న జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలు, విజయగర్జన సభకు మెదక్‌ జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామం నుంచి జనసమీకరణ చేయాలని నాయకులను ఆదేశించారు.

గర్జనకు కదిలి రావాలి
ద్విదశాబ్ది ఉత్సవాల సన్నాహాలపై దిశానిర్దేశం చేస్తున్న మంత్రి కేటీఆర్‌

ద్విదశాబ్ది ఉత్సవాలకు ప్రతీ నియోజకవర్గం నుంచి తరలాలి

పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు ఉంటుంది

కార్యకర్తలు ప్రజలతో మమేకమవ్వాలి

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌/పటాన్‌చెరు/నారాయణఖేడ్‌/జోగిపేట/జహీరాబాద్‌, అక్టోబరు 21 : వరంగల్‌లో నవంబరు 15న జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలు, విజయగర్జన సభకు మెదక్‌ జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామం నుంచి జనసమీకరణ చేయాలని నాయకులను ఆదేశించారు. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశాలలో భాగంగా గురువారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నర్సాపూర్‌, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, నారాయణఖేడ్‌, అందోలు, జహీరాబాద్‌  నియోజకవర్గాల ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. పార్టీ కోసం కష్టపడే పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలకు అండగా ఉండాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని జిల్లా నేతలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఈ నెల 25న నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించే పార్టీ ప్లీనరీకి ప్రతీ నియోజకవర్గం నుంచి 50 మంది ముఖ్య కార్యకర్తలు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.  పార్టీ శ్రేణులు గులాబి వస్త్రాలతో తరలిరావాలని ఆదేశించారు. ఈ నెల 23 వరకు మండలాల కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

 

వేలాదిగా తరలిరండి

వరంగల్‌ గర్జనకు రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి 150 బస్సులను కేటాయించామన్నారు. విజయగర్జన రోజు ప్రతీ గ్రామంలో ఉదయం తొమ్మిదిన్నరకు పార్టీ జెండాను ఆవిష్కరించి, బస్సులు, ఇతర వాహనాల్లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వరంగల్‌లో సభాస్థలికి చేరుకోవాలన్నారు. ఈ నెల 27 నుంచే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను పూర్తిచేయాలన్నారు. 


ప్రజలకు వివరించండి

రెండు దశాబ్దాల కాలంలో పార్టీ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో అనేక విజయాలను సాధించామన్నారు. తెలంగాణా కల సాకారం చేసేందుకు ఉధ్యమ నేత కేసీఆర్‌ నేతృత్వంలో రాజీలేని పోరాటం చేశారన్నారు. అంకితభావంగల కార్యకర్తలు, సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకులు ఉండటం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు.  పథకాలు ఎన్ని అమలుచేసినా వాటికి ప్రచారం కల్పిస్తేనే ప్రజల్లోకి వెళ్తాయన్నారు. ఇందుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను విస్తుృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు 75 శాతం ప్రజలకు చెరుతున్నాయన్నారు. పథకాల అబ్ధిదారులతో ఫొటోలుదిగి ప్రచారం చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎ్‌సకు మెజార్టీ ప్రజల మద్దతు ఉందని, అయినప్పటికీ కార్యకర్తలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. 

సమావేశాల్లో  మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, మెదక్‌ జిల్లాలోని మున్సిపల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్లతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నుంచి ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి నేతృత్వంలో ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. అందోలు నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీరెడ్డి, మార్కెఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శేరి జగన్మోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, హెచ్‌సీఏ సభ్యుడు భిక్షపతి, జోగిపేట ఏఎంసీ చైర్మన్‌ మల్లిఖార్జున్‌గుప్త, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆత్మకమిటీ చెర్మన్లు, మండల, పట్టణ, గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌ నుంచి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, మైనార్టీ నాయకుడు మోయిద్‌ఖాన్‌, ఖేడ్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పరశురాం, నజీబ్‌, పరమేష్‌, రవీందర్‌నాయక్‌, జడ్పీటీసీలు రాఘవరెడ్డి, నర్సింహారెడ్డి, విజయరామరాజు, రాజురాథోడ్‌, ఎంపీపీ జంగంశ్రీనివాస్‌, ఆత్మ కమిటీ రాష్ట్ర డైరెక్టర్‌ మారుతి, ఆత్మ చైర్మన్‌ రాంసింగ్‌నాయక్‌, సేవాలాల్‌ సంఘం రమేష్‌ చౌహాన్‌, టీఆర్‌ఎ్‌సలో చేరిన నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్‌ బుడ్డోళ్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి మండలాల జడ్పీటీసీలు స్వప్న, అరుణ రెడ్డి, ఎంపీపీ అంజమ్మ, ఆలయ కమిటీ చైర్మన్లు వెంకటేశం, రాజు స్వామి, మండలాల పార్టీ అధ్యక్షులు నర్సింహులు, శ్రీనివా్‌సరెడ్డి, రాచయ్యస్వామి, రవీందర్‌, ఎంజీ.రాములు, జహీరాబాద్‌ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ మొహిద్దీన్‌, రైతుసమితి కోఆర్డినేటర్‌ సుభా్‌షరావు, మంజుల బక్కరెడ్డి, తాజుద్దీన్‌, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:29:32+05:30 IST