కొవిడ్‌ ఉన్నా తగ్గని రియల్‌ జోరు

ABN , First Publish Date - 2021-05-20T05:58:27+05:30 IST

కొవిడ్‌ రెండో దశ తీవ్రరూపం దాల్చినా రియల్‌ బిజినెస్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. గత నెల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విజృంభించిన సమయంలోనూ భూములు, ప్లాట్లు, ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానా గలగలలాడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరువలో ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో రియల్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలు మాదిరిగా సాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే అసలు కొవిడ్‌ అనే మహమ్మారి ఒకటున్నదా అన్న ఆశ్చర్యం కలగక మానదు.

కొవిడ్‌ ఉన్నా తగ్గని రియల్‌ జోరు
సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రద్దీ

ఏప్రిల్‌లో ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్లు

గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈసారి వంద రెట్లు ఎక్కువ


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 19 : కొవిడ్‌ రెండో దశ తీవ్రరూపం దాల్చినా రియల్‌ బిజినెస్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. గత నెల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విజృంభించిన సమయంలోనూ భూములు, ప్లాట్లు, ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానా గలగలలాడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరువలో ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో రియల్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలు మాదిరిగా సాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే అసలు కొవిడ్‌ అనే మహమ్మారి ఒకటున్నదా అన్న ఆశ్చర్యం కలగక మానదు. 


గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయానికి గండి

గతేడాది మార్చిలో దేశంలో ప్రవేశించిన కరోనా వైరస్‌ అదే నెల 23 నుంచి లాక్‌డౌన్‌ విధించగా అన్ని రకాల వ్యాపారాలు స్తంభించాయి. అప్పట్లో సుమారు రెండు నెలల పాటు కొనసాగిన లాక్‌డౌన్‌ కారణంగా రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయానికి గండిపడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,98,300 ఆస్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి రూ.586.59 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా కరోనా ప్రభావం కారణంగా 2020-21 సంవత్సరంలో 97,371 ఆస్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి రూ.330.66 కోట్ల రాబడి వచ్చింది. అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొవిడ్‌ కారణంగా రూ.255.93 కోట్ల ఆదాయం ఒక్క ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచే ప్రభుత్వానికి కోత పడింది.


గత ఏప్రిల్‌ నెలలో పరిశీలిస్తే..

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో జరిగిన ఆస్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే కొవిడ్‌ కేసులు పెరిగినా ఆస్తుల రిజిస్ట్రేషన్ల జోరు తగ్గలేదని అర్థమవుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో ఏప్రిల్‌లో కేవలం 291 ఆస్తుల డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు కేవలం రూ.43.83 లక్షలే చేకూరాయి. అప్పట్లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను మూసేయలేదు. అయినా ప్రజలు బహిరంగంగా తిరగడంపై నిషేధం ఉన్నందున ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు రాలేకపోయారు. కాగా ప్రస్తుతం 2021-22 ఆర్థిక సంవత్సరంలో కరోనా రెండో దశ దేశం మొత్తాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయినా ఏప్రిల్‌ మొదట్లో ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, చివర్లో రాత్రి పూట మాత్రమే కర్ఫ్యూ విఽధించడంతో రిజిస్ట్రేషన్లకు ఎలాలంటి ఆటంకం ఏర్పడలేదు. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలన్నీ ఆస్తుల అమ్మకం, కొనుగోలుదారులతో నిండిపోయాయి. ఎల్‌ఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టు తమ నిర్ణయాన్ని వెల్లడించడంతో అప్పటి వరకు అడ్వాన్స్‌ ఇచ్చి నిరీక్షించిన వారందరూ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నెలలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10,221 ఆస్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వ ఖజానాకు రూ.40.12 కోట్ల రాబడి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో కేవలం రూ.43.83 లక్షల ఆదాయం సమకూరగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో దాదాపు వందరెట్లు పెరిగి రూ.40.12 కోట్ల ఆదాయం సమకూరింది. 


సంగారెడ్డి నుంచి అత్యధికంగా

అత్యధికంగా సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచే ఆదాయం చేకూరింది. నగర శివారులోని పటాన్‌చెరు ప్రాంతం కూడా కలిసి ఉన్న సంగారెడ్డి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ ఏప్రిల్‌లో 3,660 ఆస్తుల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి రూ.28.98 కోట్ల ఆదాయం సమకూరింది. అతి తక్కువగా దుబ్బాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 169 ఆస్తుల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగడంతో రూ.9.93 లక్షల ఆదాయమే ప్రభుత్వ ఖజానాలో చేరింది. ఏమైనా కొవిడ్‌ మహమ్మారితో సంబంధం లేకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడం అన్ని వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తున్నది.


Updated Date - 2021-05-20T05:58:27+05:30 IST