బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న మల్లన్న

ABN , First Publish Date - 2021-12-19T05:44:31+05:30 IST

కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో మూడు నెలలు సాగే బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. మార్గశిర మాసం చివరి ఆదివారం రోజున నిర్వహించే కల్యాణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 26వతేదీన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న మల్లన్న

26న కల్యాణంతో ఉత్సవాలు షురూఙ

మూడునెలలు.. 11 వారాలు కొనసాగనున్న మహాజాతర

బొట్టు, బోనం, పట్నం, సిగం కొమురవెల్లి ప్రత్యేకత

అరుదైన పడమటి శివాలయంగా ప్రతీతి


చేర్యాల, డిసెంబరు 18 : కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో మూడు నెలలు సాగే బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. మార్గశిర మాసం చివరి ఆదివారం రోజున నిర్వహించే కల్యాణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 26వతేదీన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 


ఆలయ విశిష్ఠత

కొమరవెల్లిలోని విజయాచల గుట్టల్లో 11వ శతాబ్దంలో మల్లన్న వెలసినట్టు చెప్పుకుంటారు. హూమాయూన్‌ కాలం నాటి నాణేలపైనా మల్లన్న చిత్రం ముద్రించబడి ఉన్నది. సాధారణంగా ఆలయాలల్లో దేవతామూర్తులు తూర్పు అభిముఖంగా ప్రతిష్ఠించబడతారు. కానీ ఇక్కడ మాత్రం స్వామివారు పడమర అభిముఖంగా వెలిశారు. ఇలా పడమటి శివాలయాలు అరుదుగా ఉండటంతో మహిమాన్వితమైనదిగా వెలుగొందుతున్నది. స్థల పురాణం ప్రకారం కొమురవెల్లి ఆలయంలో రెండు రకాల పూజలు నిర్వహిస్తారు. మల్లికార్జునస్వామి వీరశైవుల ఆడపడుచు మేడలాదేవీని, యాదవుల ఆడబిడ్డ అయిన కేతలాదేవీని వివాహమాడారు. అందుకే వీరశైవాగమశాస్త్రం ప్రకారం అర్చకులు గర్భాలయంలో ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. అలాగే యాదవుల తరఫున ఒగ్గు పూజారులు పంచరంగులతో పట్నాలు వేసి పూజలు నిర్వహిస్తున్నారు. పసుపు బండారిని భక్తులకు స్వామివారి ప్రసాదంగా అందజేస్తారు. వీరశైవాగమశాస్త్ర ప్రకారం మార్గశిరమాసం చివరి ఆదివారం వేదమంత్రోచ్ఛారణలతో స్వామివారం కల్యాణం నిర్వహిస్తారు. యాదవ సంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారులు మహాశివరాత్రి రోజున పెద్దపట్నం రచించి కల్యాణం జరిపిస్తారు. 


కోర్కెలు తీర్చే కొంగుబంగారం

ఆలయ ప్రాంగణంలోని గంగిరేగుచెట్టును మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు తమ కోర్కెలు ఈడేర్చమని ఈ చెట్టుకు ముడుపులు కడతారు. 2014కు ముందు గంగిరేగు చెట్టు ప్రాంగణంలోనే స్వామివారి కల్యాణాన్ని నిర్వహించేవారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు, దోషాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ భక్తులు మల్లన్నకు బోనం నివేదించి మొక్కులు తీర్చుకుంటారు. తమ కోరికలను ఈడేర్చినందుకు భక్తులు మొక్కుబడిగా ఆలయ సమీపంలోని కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టేస్తారు. రాతి గీరెల ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే పుత్రసంతానం కోసం ఒల్లు బండ వరం పడతారు. మల్లన్న దర్శనం అనంతరం భక్తులు మల్లన్న సహోదరి ఎల్లమ్మ తల్లికి బోనం నివేదించి, కల్లును శాకపోసి ఒడిబియ్యం సమర్పిస్తారు. 


దినదినాభివృద్ధి

కొమురవెల్లి మల్లన్న ఆలయం దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్నది. రెవెన్యూ శాఖ పరిధిలోకి చేరిన సమయంలో ఆలయ ఆదాయం రూ.1,500 మాత్రమే. 1956లో దేవాదాయశాఖ పరిధిలోకి చేరినప్పుడు రూ.4,500కు పెరిగింది. ప్రస్తుతం భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం రూ.20 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం 2014లో రూ.5 కోట్లు, మూడేళ్ల క్రితం మరో రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తులు సమర్పించిన వెండి మిశ్రమాన్ని కరిగించి ఇటీవల ద్వారాలకు వెండి తొడుగులు చేయించారు.


కొమురవెల్లిలో బ్రహ్మోత్సవాల వివరాలు 

=26–12–2021న స్వామివారి వార్షిక విశేష కల్యాణోత్సవం, ఉదయం 5 గంటలకు స్వామివారి దృష్టికుంభం, బలిహరణం, 10–45 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, ఏకాదశ రుద్రాభిషేకం, లక్షభిల్వార్చన, రాత్రి 7 గంటలకు శకటోత్సవం.

=27–12–2021న ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన.

=01–03–2022న మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయాన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఒంటి గంటకు పల్లకీసేవ, 2 గంటలకు పెద్దపట్నం.

=02–03–2022న ఏకాదశ రుద్రాభిషేకం.

=16–03–2022న కామదహనం.

=18–03–2022న వసంతోత్సవం (హోళీ).

=27–03–2022న రాత్రి 7 గంటలకు వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ. 

=28–03–2022న తెల్లవారుజామున గురుపూజ, బలిహరణ, అగ్నిగుండ ప్రవేశం, గెలుపు విజయోత్సవం, ఏకాదశ రుద్రాభిషేకం, మహదాశీర్వచనం.

=సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారం (16–01–2022) నుంచి ఫల్గుణ మాసం చివరి ఆదివారం (27–03–2022) వరకు 11 వారాల పాటు ప్రతీ ఆదివారం జాతర జరుగుతుంది. ఇందులో ప్రధానమైన ఘట్టాలు... పట్నంవారం, లష్కర్‌వారం, మహాశివరాత్రి పెద్దపట్నం, అగ్నిగుండాలు.

Updated Date - 2021-12-19T05:44:31+05:30 IST